Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్‌ః  బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రావణ రాజ్యంగా మార్చారని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కెసిఆర్ దౌర్భాగ్యమైన పాలనతో విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారి విశ్వాసానికి అనుగుణంగా పాలన చేస్తున్నారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కెటిఆర్, టి. హరీష్ రావు విష ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.

నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఆ తర్వాత వాటిని విస్మరించారని ఆయన విమర్శించారు. సిఎం పదవి కోసం పార్టీని లాక్కొవాలని హరీష్ రావు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి అక్రమాలపై వెల్లువెత్తిన విమర్శలతో పాటు, పాలమూరు-రంగారెడ్డి సోర్స్ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు ఎందుకు మార్చారో కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు.