Reading Time: 2 minutes

ఏడు గంటల పాటు విచారణ

ట్యాపింగ్ కోసం తాను ఎలాంటి పరికరాలు కొనుగోలు చేయలేదని ఖండన

త్వరలో హరీష్‌రావుకు నోటీసులు..?

నేడు సుప్రీంలో విచారణకు రానున్న కేసు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి నవీన్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించింది. సుమారు ఏడు గంటలు నవీన్ రావును విచారించిన అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నారు. ప్రత్యేక డివైజ్ లు ఉపయోగించి అప్పటి ప్రతి పక్ష నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారని నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో నవీన్ రావు గత ఎస్‌ఐబి అధికారులను ఎలా ఉపయోగించుకున్నాడు అనే అంశంపై సిట్ అధికారులు ఆరా తీశారు. ప్రయివేట్ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారు, వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారనేదానిపై సిట్ కూపీ లాగింది. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎస్‌ఐబి అధికారులతో సంబంధాలపై నవీన్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఒక్కొక్కరినీ విచారించే కొద్దీ కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. నవీన్ రావు విచారణలో తన వెనుక ఎవరున్నారు? ఎవరితో చేయి కలిపారు? వంటి ప్రశ్నలు సిట్ అధికారులు సంధించినట్లు సమాచారం. కాగా, సిట్ విచారణలో నవీన్‌రావు పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. నిందితులతో ఎటువంటి సంబంధం లేదని సిట్ అధికారుల ఆరోపణలు తోసిపుచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులయిన పలువురు రాజకీయ నేతల స్టేట్ మెంట్‌ను సిట్ అధికారులు నమోదు చేశారు. నవీన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా మరికొందరు బిఆర్‌ఎస్ ముఖ్య నేతలను విచారించే అవకాశం ఉందని సమాచారం. విచారణ అనంతరం నవీన్ రావు మీడియాతో మాట్లాడుతూ 2024 సెప్టెంబర్‌లో తనను విచారణకు పిలిస్తే హాజరయ్యానని, అప్పుడు కూడా మూడు గంటలు విచారించారని తెలిపారు.

విచారణకు పూర్తిగా సహకరించానని, ఫోన్ ట్యాపింగ్ కోసం బయట నుంచి డివైజ్ పరికరాలను తాను కొనుగోలు చేసి ఇచ్చినట్లు బయట ప్రచారంలో వాస్తవం లేదని, విచారణ అధికారులు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదని ఆయన ఖండించారు. ఈ వ్యవహారంలో సంబంధాలున్నట్లు కొందరు నేతలు, వ్యక్తులతో సంబంధాలపై అడిగారని,ఆ విషయాలేవీ తనకు తెలియదని చెప్పానని తెలిపారు. గత విచారణలో సిట్ అధికారులు తనను ఏం అడిగారో తాజాగా తిరిగి అవే ప్రశ్నలు అగిడినట్లు ఆయన వివరించారు.

హరీష్ రావు విచారణ…?

ఇలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు తదనంతరం మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఏ టి. హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన ఫోన్ ట్యాప్ చేశారని ఇదివరకే సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ సిట్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై సిట్ నమోదు చేసిన కేసుపై హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించగా కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే కొట్టివేతను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. ఈ నేపధ్యంలో త్వరలోనే హరీష్‌రావును విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సిట్ వర్గాల సమాచారం. సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలపై హరీష్‌రావుకు నోటీసులు ఇచ్చే అంశం ఆధారపడి ఉంది. కాగా, అసెంబ్లీ సమావేశాల అనంతరం తనకు కూడా సిట్ నుంచి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ఇటీవల మీడియా సమావేశంలో హరీష్ రావే స్వయంగా చెప్పడం గమనార్హం.