
అపెక్స్ కౌన్సిల్ డాక్యుమెంట్‌లో తనకు కావాల్సింది మాత్రమే రేవంత్‌రెడ్డి చదివారని హరీష్‌రావు మండిపడ్డారు. కెసిఆర్ ఇచ్చిన లేఖలో ఆయనపై నెపం నెట్టే విధంగా అవసరమైన పేరాలను, వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి అసెంబ్లీ చదివారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి పేరా చదవకుండా రెండో పేరా చదువారని ఎద్దేవా చేశారు. పాలమూరు, డిండి ఎత్తిపోత పథకాన్ని కొనసాగిస్తామని, గోదావరిలో మిగులు జలాలపై కూర్చొని మాట్లాడుకుందామని కెసిఆర్ చెప్పారన్నారు. టెలిమెట్రీ పెట్టాలని 2016లోనే అడిగారని పేర్కొన్నారు. 299 టిఎంసిలకు కెసిఆర్ ఒప్పకున్నారని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవన్నీ దాచి.. సగం పేరాగ్రాఫ్‌లు మాత్రమే చదివి రేవంత్‌రెడ్డి మోకాలు, బోడిగుండుకు ముడిపెట్టేలా మాట్లాడారని మండిపడ్డారు. తాత్కాలిక అరేంజ్‌మెంట్‌కు ఒప్పుకుంటే, అగ్రిమెంట్‌కు ఒప్పుకున్నట్లు రేవంత్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో చంద్రబాబు, జగన్‌లతో పాటు మోడీని సైతం కెసిఆర్ నిలదీశారని తెలిపారు. పోతిరెడ్డిపాడు ఆపకపోతే ఆలంపూర్ దగ్గర ప్రాజెక్టు కడతామని హెచ్చరించారని చెప్పారు. మొదటి అపెక్స్‌కౌన్సిల్‌లో 299కి కెసిఆర్ ఒప్పుకుంటే, ఇంకెప్పుడు టిబ్యునల్ వేస్తారని నిలదీస్తారా ..సుప్రీంకోర్టుకు వెళ్తారా ..? అని ప్రశ్నించారు. కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులు మేం రన్నింగ్ ప్రాజెక్టులు చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత తమది అని పేర్కొన్నారు. కల్వకుర్తిలోనే 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని, కృష్ణాలో 50:50 ఇవ్వాలని తాము 28 లేఖలు రాశామని తెలిపారు. తాము మరణశాసనం రాశామని కాంగ్రెస్ అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు.
ప్రతి నిమిషం కెసిఆర్ కేంద్రంపై పోరాడారని, ప్రధానికి లేఖలు రాశారని చెప్పారు. కేంద్రం మెడలు వంచి ఒప్పించి కృష్ణాజలాల పున:పంపిణీకి సెక్షన్ -3 సాధించిందే కెసిఆర్ అని వెల్లడించారు. 2023లోనే 66.34 లేకుండానే అగ్రిమెంట్ చేశామని, కాంగ్రెస్ వచ్చాక మళ్లీ 66:334కు ఒప్పుకుందని అన్నారు. సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునః పంపిణీ జరగనుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69 శాతం నీళ్లు రావాలని కెసిఆర్ కేంద్రానికి లేఖ రాశారని, సెక్షన్ 3 కోసం 32 లేఖలు రాశారని చెప్పారు. కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3 సాధిస్తేనే..నీళ్ల పంపిణీపై ట్రిబ్యునల్ దగ్గర వాదనలు కొనసాగుతున్నాయని అన్నారు.