Reading Time: < 1 minute

ఈలోగా డిసిసిల కూర్పు పూర్తి చేసి నివేదికలు ఇవ్వండి

సిఎం హాజరవుతారని జూమ్ మీటింగ్‌లో జిల్లా అధ్యక్షులకు ఉపదేశించిన మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 8న నిర్వహించనున్నట్లు ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ లోగా జిల్లా కమిటీ (డిసిసి)ల కూర్పు పూర్తి చేసి తమకు నివేదికలు అందజేయాలని వారు ఆదివారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారిని, ఎక్కువ సమయం పార్టీకి కేటాయించే వారిని ఎంపిక చేయాలని, సామాజిక సమతుల్యత పాటించాలని, మహిళలకూ సముచిత స్థానం కల్పించాలని వారు ఆదేశించారు.

ఈనెల 8న గాంధీ భవన్‌లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరవుతారని వారు తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముని పేరును కుట్ర పూరితంగా తొలగించడంపై దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విస్తృత స్థాయి సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించి ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు వారు చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను కూడా పూర్తి చేయాలని వారు ఆదేశించారు.