
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ భస్మాసురునికి సోదరుని (కజిన్ బ్రదర్) వంటి వారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ వ్యంగ్యాస్త్రం సంధించారు. కెటిఆర్ అహంకారం పరాకాష్టకు చేరిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. బంగారు తెలంగాణను భ్రష్టు పట్టించిన సైన్యం బిఆర్‌ఎస్ నేతలది అని తెలిపారు. నిరుద్యోగుల ఉసురు తగలడం వల్లే బిఆర్‌ఎస్‌కు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బిసిల పట్ల చిత్తశుద్ధితో తాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశామని ఆయన తెలిపారు. ఉరి తీయడం అంటే తప్పు చేసిన వారికి సరైన శిక్ష వేయడం అనే అర్థంగా భావించాలని ఆయన వివరించారు. ఎన్నికల్లో ఎవరికి ఉరి వేయాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. ఎన్నో ఆశలతో కోట్లాది మంది తెలంగాణను తెచ్చుకుంటే వారి ఆశలను బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం చేసిన రైతు రుణ మాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కెటిఆర్‌కు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కెటిఆర్‌కు ధైర్యం ఉంటే ముందుగా కవిత చేసిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.