
రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పై వైసీపీ చేతికి సరికొత్త అస్త్రం
కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా: ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు
జగన్ వల్లే రాయలసీమ ‘లిప్ట్’ నిలిచిపోయింది: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం: వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి
భావితరాలకూ చంద్రబాబు తీరని ద్రోహం: కర్నూలు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి
మన తెలంగాణ/అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ – తెలంగాణ మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. బనకచర్లతో అనేక మలుపులు తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకానికి 90 టీఎంసీలు రావాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అలా కుదరకపోతే జూరాల నుంచి నేరుగా నీటిని తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ఇదే సమయంలో బనకచర్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ పర్యటన ముగియడంతో ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో తనకు తెలుసని, కృష్ణా జలాల వివాదంపై త్వరలోనే మాట్లాడతానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు వివరణ తర్వాత ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ అంశంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్థం మొదలైంది.
జగన్ వల్లే రాయలసీమ ‘లిప్ట్’ నిలిచిపోయింది: మంత్రి సవిత
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. జగన్ చేసిన తప్పిదాలను తన సొంత మీడియా ద్వారా కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబును బూచిగా చూపి రాజకీయ ఉనికి చాటుకోవడం తెలంగాణ రాష్ట్ర అధికార, విపక్షాలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు.
2020లో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథక నిర్మాణం చేపడుతున్నామని జగన్ ప్రభుత్వం అట్టాహాసంగా ప్రకటించిందన్నారు. ఈ ప్రకటనపై ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో, కేంద్రంతో పాటు ఎన్జీటీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాయన్నారు. జగన్ రెడ్డి చేసిన తప్పు చేసి కప్పిపెట్టి తమ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. విషపు రాతలు మానుకోకుంటే, జగన్ కు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాయలసీమ ద్రోహి జగన్ అని, తన రాజకీయ ఉనికి చాటుకోవడం కోసం డ్రామాలు ఆడడం ఆయనకు అలవాటేనని మంత్రి సవిత విమర్శించారు. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ప్రసక్తే లేదని మంత్రి సవిత తేల్చిచెప్పారు. రాయలసీమకు మొదటిసారిగా నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు.
రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం: వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణశాసనం రాస్తున్నారని వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలతో చంద్రబాబు ద్రోహం బయటపడిందని ఆయన తేల్చి చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం స్వప్రయోజనాల కోసమే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కి చంద్రబాబు మంగళం పాడారని మండిపడ్డారు. శాసనసభ సాక్షిగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. చంద్రబాబు తప్పుకి నిష్కృతి లేదని ధ్వజమెత్తారు. కేవలం స్వప్రయోజనాల కోసమే పర్యావరణ అనుమతులు లేవన్న సాకుతో చంద్బ్రాబే రాయ్ల్సీమ లిఫ్టు ఇరిగేష్న్ స్కీమ్ నిలిపివేశాడని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ ఏపీకి నీటిగండమేనన్న శ్రీకాంత్ రెడ్డి, ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడ్డంలో విఫలమయ్యారని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన రాయలసీమను ఎడారిగా మార్చే కుట్రకు పాల్పడవద్దని హెచ్చరించారు.
భావితరాలకూ చంద్రబాబు తీరని ద్రోహం: ఎస్వీ మోహన్ రెడ్డి
కేవలం తన స్వప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంతో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను నిలిపివేశారని కర్నూలు వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రోహాన్ని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు నిలిపివేయడం ద్వారా చంద్రబాబు రాయలసీమ ప్రజల భవిష్యత్తున తాకట్టు పెట్టడంతో పాటు, భావితరాలకు తీరని ద్రోహం చేశారని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో కీలకంగా ఉన్నా కూడా చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్ల గురించి ఊసెత్తడం లేదన్న ఆయన రాయలసీమ మంత్రులుకూ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు పట్టవా అని నిలదీశారు. జరుగుతున్న అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తక్షణమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించాలన్న ఆయన లేనిపక్షంలో ప్రజల తరపున వైయస్సార్సీపీ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు.
ఏ స్వార్ధ ప్రయోజనాల కోసం ఆపారో చెప్పాలి: మాజీ మంత్రి సాకే శైలజానాథ్
ఏ స్వార్ధ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతలను ఆపారో చంద్రబాబు చెప్పాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఏ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి రాయలసీమ ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టారో స్పష్టం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. కేసుల గురించి కాకుండా రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కు కావాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ఆ ప్రాంత మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు సిఎం చంద్రబాబుకు అల్టిమేటం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యుద్ధ ప్రాతిపదికన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించి పూర్తి చేయని పక్షంలో వారిని ప్రజల్లో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. రాయలసీమకు నష్టం జరిగే ఏ చర్యలను తాము సహించమని, ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీనే లేకుండా చేస్తామని అన్నారు. రాయలసీమ బిడ్డను అని చెప్పుకునే చంద్రబాబు ఆఖరి ముసుగు కూడా తొలగిపోయిందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. కావాలంటే నిజ నిర్థారణ కమిటీ వేసుకోవాలని ధైర్యంగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు చూస్తే చంద్రబాబు తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.