
న్యూఢిల్లీ: నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. ఫోన్ సిగ్నల్ కోసం బాల్కనీలోకి వెళ్లిన ఓ వ్యక్తి 17వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో ఒకరైనా అజయ్ గార్గ్. అజయ్ ఎటిఎస్ వన్ హామ్లెట్ హౌసింగ్ సొసైటీలో భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. నెట్‌వర్క్ సమస్య తలెత్తడంతో ఆయన బాల్కనీలోకి వెళ్లారు. కొంత సమయానికే 17వ అంతస్థు నుంచి కిందపడ్డారు. వెంటనే స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అజయ్ పై అంతస్థు నుంచి పడి పోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. జారి పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారా? మరేమైనా జరిగిందా? అనేది తేలాల్సి ఉందని అన్నారు. విచారణ చేస్తున్నట్లు చెప్పారు.