Reading Time: < 1 minute

వచ్చే నెల నుంచి భారత్, శ్రీలంక వేదికగా ఐసిసి టి-20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్ల లిస్ట్‌ని ఆయా దేశాల బోర్డులు ఒక్కొక్కటిగా ప్రకటించాయి. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అఘా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ, వైస్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని వెల్లడించలేదు.

చాలాకాలం పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ ఎట్టకేలకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదికి సైతం జట్టులో చోటు కల్పించారు. కానీ, అతడి ఫిట్‌నెస్ అనిశ్చితి కారణంగా బ్యాకప్‌గా మరో పేసర్ హరీస్ రౌఫ్‌ని ఎంపిక చేశారు. స్పిన్ బౌలింగ్‌లో ఆల్ రౌండర్ షాదాబ్‌ ఖాన్ రీ ఎంట్రీ ఇవ్వగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్‌కి ఈ జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో ఉస్మాన్ ఖాన్ ప్రధాన క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఇది ప్రొవిజనల్ జట్టు మాత్రమే. శ్రీలంకతో టి-20 సిరీస్(జనవరి 11) ముగిసిన తర్వాత అసలు జట్టును ప్రకటిస్తారు.

టి-20 ప్రపంచకప్‌కి పాకిస్థాన్ ప్రొవిజనల్ జట్టు

సల్మాన్ అలీ ఆఘా(కెప్టెన్), బాబర్ ఆజామ్, షాహీన్ అఫ్రిది (ఫిట్‌నెస్ అనిశ్చితి), ఉస్మాన్ ఖాన్(కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రౌఫ్, ఫకర్ జమాన్, మొహమ్మద్ వసీం జూ., నసీం షా, అబ్దుల్ సమాద్, షాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.