
హైదరాబాద్: దివంగత ప్రధాన మంత్రి నెహ్రూ గాంధీ హయంలో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, సింగూరు, మంజీరా డ్యామ్ లు కాంగ్రెస్సే నిర్మించిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. హైదరాబాద్ ప్రజలకు సింగూరు, మంజీరా డ్యామ్ ల ద్వారా తాగునీరు సరఫరా అయ్యిందని, కాళేశ్వరం కట్టాకే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టు బిఆర్ఎస్ ప్రచారం చేస్తోందని తెలియజేశారు. అదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాలపై సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు మాట్లాడారని, మంజీరా, సింగూరు నీళ్లు తాగే మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పెద్దయ్యారని చురకలంటించారు. ఇప్పుడు ఆ డ్యామ్ లు కట్టిన కాంగ్రెస్ నే తిడుతున్నారని, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పనులను 90 శాతం పూర్తి చేసింది కాంగ్రెస్సే అని పేర్కొన్నారు. ఆంధ్రవాళ్లను తిట్టింది వాళ్లేనని, బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎప్పుడైనా ఆంధ్రోళ్లు నీళ్లు దోచుకున్నారని ఎందుకు అనలేదు? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.