
హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెర్టెక్స్ గేటెడ్ కమ్మూనిటీలో ఉన్న స్విమ్మంగ్‌పూల్‌లో పడి అర్జున్ కుమార్(3) అనే బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు చింతల్‌లో నివసిస్తుండగా.. సెలవుల నిమిత్తం బాలుడిని హైదర్‌నగర్‌లో అమ్మమ్మ ఇంట్లో వదిలి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌లో ఆడుకుంటున్న అర్జున్ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో కొంత సమయం తర్వాత బాలుడి నీటిపై తేలుతూ కనిపించాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆ పిల్లాడిని నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు ఆ పిల్లాడికి సిపిఆర్ చేసినా ఫలితం లేదు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీకెండ్ అయినా.. పూల్ వద్ద కేర్ టేకర్స్ లేకపోవడం, సిసి కెమెరాల ఆపరేటర్ లేకపోవడమే తన కుమారుడి మరణానికి కారణమైందని బాలుడి తండ్రి వాపోయాడు. అర్జున్ ఇక లేడు.. అందనంత దూరం వెళ్లిపోయాడని బాలుడి తండ్రి రోదన అందరిని కంటతడి పెట్టించింది.