
అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయించానన్న సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎపి ప్రభుత్వం ఖండించింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ పనులు ఆపివేయించానన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పు పట్టింది. సిఎం చంద్రబాబు నాయుడును కేంద్రంగా చేసుకొని తెలంగాణ అధికార పక్షం, విపక్షాలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణలు చేసింది. ఆంధ్రాకు వచ్చే నీటి హక్కులు, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజీ ఉండబోదని పేర్కొంది. కేంద్రం నుంచి అనుమతులు తీసుకోకుండా జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టడంతో తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేయడంతో పాటు కేంద్రం, ఎన్‌జిటికి ఫిర్యాదు చేసిందని వివరించింది. తెలంగాణ ఫిర్యాదుల మేరకు అనుమతులు లేకపోవడంతో రాయల సీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు ఆపివేయాలని కేంద్రం, ఎన్‌టిజిటి ఎపి ప్రభుత్వానికి అప్పడు ఆదేశాలు జారీ చేసిందని తెలియజేసింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం పనులను నిలిపివేసిందని గుర్తు చేసింది.
తెలంగాణ శాసన సభలో కృష్ణానదీ జలాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పటి ఎపి సిఎం జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టడంతో కెసిఆర్ భుజం తట్టి ప్రోత్సహించాడన్నారు. ప్రస్తుతం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించానన్నారు. తన మీద చిత్తశుద్ధితో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని చంద్రబాబును అడగగానే తన మీద గౌరవంతో పనులు నిలిపివేశారని మాట్లాడిన విషయం తెలిసిందే.