Reading Time: < 1 minute

హైదరాబాద్: ప్రాణాలను పణంగా పెట్టి మాజీ సిఎం కెసిఆర్ తెలంగాణ సాధించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ప్రజల ముందు వాస్తవాలు పెడతామని.. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ ను, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీశ్ రావును ఉరితీయాలని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదుల ఏ బేసిన్ లో ఉందని అడిగేవారు ఇరిగేషన్ పై మాట్లాడుతున్నారని, చెక్ డ్యామ్ లను పేల్చే ఇలాంటి చెత్త ప్రభుత్వం ఎక్కడా ఉండదని కెటిఆర్ విమర్శించారు. మేడిగడ్డను బాంబులతో పేల్చిన చెక్ డ్యామ్లను పేల్చి వేశారని, పేదల ఇళ్లు కూల్చడం తప్ప ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలని మాట తప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీను, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అని మాట తప్పినందుకు, 420 హామీలు ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఉరి తీయాలని ధ్వజమెత్తారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. మీలాంటి వికృతమైన మాటలతో కెసిఆర్ స్థాయిని తగ్గించలేరని సూచించారు. సిఎం రేవంత్ రెడ్డికి దోచుకోవడం.. దాచుకోవడమే తెలుసని, తెలంగాణ కోసం ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడట.. ఆటో డ్రైవర్లను, గురుకులాల్లో పిల్లల్ని పొట్టనబెట్టుకున్నారని కెటిఆర్ పేర్కొన్నారు.