Reading Time: < 1 minute

హైదరాబాద్: పాలమూరు వలసలకు కారణం, నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్సే అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ కృష్ణా జలాలపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారని, అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. అసభ్యకరమైన భాషలో అబద్ధాలు చెప్పారని, ప్రజాస్వామ్యానికి దేవాలయమైన అసెంబ్లీలో నాలుక కోస్తానని మాట్లాడటమేంటి అని అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా అతి వికృతంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా యదేచ్చగా బూతులు ప్రయోగిస్తుంటే స్పీకర్ వారించకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయమన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషను సభ్య సమాజం క్షమించదని, బిఆర్ఎస్ పోరాట ఫలితంగానే రాయలసీమ లిఫ్ట్‌పై ఎన్ జిటి స్టే ఇచ్చిందన్నారు. తమ ఘన కార్యమని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని హరీష్ రావు దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు భాగం పంచుకోని రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ రథ సారథి అయిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ది గురించి ప్రశ్నించడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమేనన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45టిఎంసిలకు తగ్గించిన మాట నిజమే అని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి చెప్పక తప్పలేదన్నారు.