
అమరావతి: రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే ఓ మాజీ సైనికుడు రైలు కిందపడి చనిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో దువ్వాడ రైల్వే స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హావ్‌డా-బెంగళూరు రైలు ఒకటో ప్లాట్‌ఫాం మీదకు వస్తోంది. ప్లాట్ మీద నిలబడిన వ్యక్తి రైలు దగ్గరికి రాగానే దూకి తలను పట్టాలపై పెట్టాడు. అందరూ చూస్తుండగానే మొండెం నుంచి తల వేరుగా పడిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికుల అరుపులు కేకలతో స్టేషన్ దద్దరిల్లింది.
అక్కడ ఉన్నవారు భయంతో వణికిపోయారు. మృతుడు విశాఖపట్నం జిల్లా పెదగంఒట్యాడ మండలం నెల్లిముక్కు చెందిన నీలపు వెంకటరమణారెడ్డిగా గుర్తించారు. ఆయన గతంలో భారత సైన్యంలో జవాన్‌గా పని చేశారు. ఉద్యోగం రిటైర్డ్ అయిన తరువాత ఉక్కు కర్మాగారంలో పని చేశాడు. టిడిపిలో చురకైన కార్యకర్త పని చేస్తూనే కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిలు చేసి అత్తారింటికి పంపించాడు. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.