
దశాబ్దాల స్వాతంత్య్ర పోరాటం తర్వాత ఆంగ్ల జాతి నుండి ముక్తి పొందిన భారతదేశం నేటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఆసియా ఖండంలో అత్యంత సిరిసంపదలున్న భారతదేశంలో పరాయి మూకల దౌర్జన్యాలతో, దండయాత్రలతో అపారమైన వనరులు కొల్లగొట్టబడ్డాయి. కులమతాలను రెచ్చగొట్టిన బ్రిటీషు పాలకులు దేశం వదలి పారిపోయినా వారి అవశేష జాడ్యాలు మనల్ని వదలడం లేదు. అవినీతి, పేదరికం, ఉగ్రవాదం, మేధావుల విదేశీవలస మన ప్రగతికి ప్రతిబంధకంగా మారాయి. అన్ని అవరోధాలను దాటుకుంటూ, గమ్యంలో ఎదురయ్యే ముళ్ళపొదలను ఒక్కొక్కటిగా పెకలించుకుంటూ భారత్ అభివృద్ధి వైపు పయనం సాగించడానికి ప్రయత్నం చేస్తున్నది. కులమతాల వైషమ్యాలు, భాషా దురభిమానాలు, ప్రాంతీయతత్వాలు భరత జాతి గుండెను కుదుటపడనీయడం లేదు. శత్రుశేషం పొంచి ఉంది. సరిహద్దు భద్రత ఇంకా ప్రమాదంలోనే ఉంది. అయినా మన త్రివిధ దళాల తెగువ, ధైర్యసాహసాలు మన ప్రశాంత జీవనానికి మార్గం సుగమం చేసాయి. దేశ విభజన భరతమాతకు తీరని వ్యథను మిగిలించగా, బంగ్లా విమోచనం మన దాయాది దేశపు పగను మరింత జ్వలింప చేసింది.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ‘పాక్’ అంతర్జాతీయంగా అభాసుపాలై, ఒంటరిగా మిగిలినా తన దుశ్చర్యలకు పదునుపెడుతూనే ఉంది. పహల్గాం దమనకాండ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాక్ తన ధోరణి మార్చుకుంటుందని ఆశించడం అత్యాశే కాగలదు. ఇటీవలికాలంలో అమెరికా అధ్యక్షుడు భారత్‌పై అక్కసు పెంచుకోవడం, ప్రతీకార సుంకాలతో భారత్‌ను దెబ్బతీయాలని ప్రయత్నించడంతో భారత్ చైనాకు దగ్గరవుతుందన్న సూచనలు కనిపించినా, ఇది ఆచరణ సాధ్యం కాదు. చైనా తన వక్రబుద్ధితో మన ఈశాన్య రాష్ట్రాలను కబళించాలనే ‘డేగకన్ను’తో నిరంతరం మనపై ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నది. భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా మోకాలడ్డుతున్నది. పాకిస్తాన్‌కు సమీప భవిష్యత్తులో తీవ్రనష్టం వాటిల్లనున్నా కేవలం మన దేశం మీదున్న గుడ్డి ద్వేషంతో పరాయి దేశాలవెంట పరుగెడుతున్నది. దాయాది దేశం తన కంటిని తానే పొడుచుకోవడానికి సిద్ధమవుతున్నది. బంగ్లాదేశ్ విమోచనంలో మనమెంత సహాయపడినా ఆ దేశం తిరిగి పాక్ విషపరిష్వంగంలో సేద తీరుతున్నది. అయినా భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడగలుగుతున్నది. దేశం విద్య, వైద్య, ఆరోగ్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఎంతగా దేశం అభివృద్ధిని సాధించినా, అభివృద్ధి ఫలాలు పెరిగిన ప్రజలకు అందడం లేదు. స్వాతంత్య్రానికి పూర్వం 39 కోట్లున్న భారత జనాభా నేడు 140 కోట్లకు చేరింది. పెరిగిన జనాభాకు సరిపడా ఆహారాన్ని, ఆవాసాన్ని కల్పించడం దేశానికి తలనొప్పిగా మారింది.
ఇదే సందర్భంలో దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైనది. చదువుకున్న యువత విదేశీ వ్యామోహం వలన ‘బ్రెయిన్ డ్రెయిన్’ సమస్య కొనసాగుతూనే ఉంది. భారతీయ మేధస్సు ఉషస్సులు విదేశాలపై ప్రసరించడంవలన విదేశాలు అభివృద్ధిపథంలో సాగుతున్నాయి. మేధావుల వలసలను ఆపి, వారి మేధస్సుకు తగిన గుర్తింపు నిచ్చే చర్యలు ప్రారంభించకపోతే అది దేశానికే పెనుశాపంలా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సువిశాలమైన మన దేశంలో ఖనిజసంపదకూ, జలసంపదకూ, మానవ సంపదకూ లోటు లేనే లేదు. అయితే వీటి వినియోగమే సరిగాలేదు. అవినీతి అనే మహమ్మారి భారతీయ సామాజిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నది. వీటితో పాటు విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో చోటుచేసుకుంటున్న వినాశన కరమైన ధోరణి భావిప్రగతికి గొడ్డలిపెట్టు. వీటిని సరిదిద్దే చర్యలు చేపట్టాలి. భారతదేశంలో వనరులకు కొరత లేదు. అయినా అందరికీ కూడు, గూడు, గుడ్డ, విద్య, ఆరోగ్య వసతులను కల్పించలేకపోతున్నాం. అపారమైన జలసంపద ఉన్నా ఆ జలరాశిని వినియోగంలోకి తేలేకపోతున్నాం. నదుల అనుసంధానమే వృథాగా కడలి పాలవుతున్న జలసంపద సద్వినియోగానికి ఏకైక మార్గం. నేటికీ దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పరిశుభ్రమైన త్రాగునీటికి నోచుకోలేక, రోగాల పాలవుతున్నారు. పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టు కానవస్తుంది. సరైన త్రాగునీటి సదుపాయం లేదు. చాలా పాఠశాలల్లో ఈనాటికీ సరైన మౌలిక సదుపాయాలు, మరుగు దొడ్లు లేకపోవడంతో చాలా మంది బాలికలు చదువుకు దూరమవుతున్నారు.
విద్యా వ్యవస్థను చక్కదిద్దే ముందు పాఠశాలల్లో కనీస సదుపాయాలను మెరుగుపరచాలి. విద్యావంతులు పెరుగుతున్నా, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం మన అభివృద్ధికి శరాఘాతం. గతంలో మాదిరిగా మన దేశంలో సాంప్రదాయబద్ధమైన వృత్తులు లేవు. విద్యావంతులంతా ఉద్యోగ వేటలో పడిపోవడం వలన వ్యవసాయం రంగం అనాథలా మారిపోయింది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నా, భారతదేశం ఆర్థిక మాంద్యపు కోరలలో చిక్కకపోవడానికి ప్రధాన కారణం మనది వ్యవసాయిక దేశం కావడమే. ఏనాటికైనా మన దేశాన్ని జీవనాడి వ్యవసాయ రంగమే. శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు వ్యవసాయరంగాన్ని కూడా ఇతోధికంగా ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. రైతన్న బ్రతుకులకు భద్రత కావాలి. వ్యవసాయ రంగంతో పాటు భావిభారతాన్ని సుశోభితం చేసే విద్యారంగాన్ని మెరుగు పరచాలి. మొత్తం విద్యారంగాన్ని ప్రభుత్వమే నడపాలి. ధనిక, పేద అనే తారతమ్యంలేకుండా అందరికీ సమానమైన విద్యావకాశాలు రావాలి. అన్ని స్థాయిల్లోను విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలి. ఉచిత విద్యను అందించాలి. భారతదేశం ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోవాలంటే అవినీతి జాడ్యం అంతరించాలి. ఇది నా దేశం అనే భావన ప్రతీ ఒక్కరిలో నరనరాన జీర్ణించుకుపోవాలి. శతకోటి దరిద్య్రాలకు అనంత కోటి ఉపాయాలున్నట్టు దేశంలోని సమస్యలన్నింటికీ మార్గాన్వేషణ చేయాలి. సంకుచిత భావాలు, స్వార్థచింతన కొంత మేరకు కట్టి పెట్టి దేశహితం కోసం పాటుపడాలి.
సుంకవల్లి సత్తిరాజు
9704903463