Reading Time: 3 minutes

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రభుత్వం తప్పు చేస్తోందా? ఆత్మరక్షణలో పడిందా! పిపిపి విధానం ప్రజల్ని ఒప్పించలేక పోయిందా?. ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్ఫై ఆరు మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ముద్దు.. ప్రైవేటైజేషన్ వద్దు.. అని చేసిన సంతకాలు గవర్నర్ చెంతకు చేరడం అనేది ఒక ఉద్యమ విజయం. ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. లేదంటే ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా ప్రజలే ఉద్యమ నాయకులుగా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. రాజకీయాలకు అతీతంగా ప్రజా నిర్ణయాన్ని పాలకులు గౌరవించాలి. వివరాలు లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సుమారు 32 నుండి 39 వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ కాలేజీలు కలిసి ఉన్నాయి. సుమారు 19 ప్రభుత్వ, 19 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం ఎంబిబిఎస్ సీట్లు 5585 వరకు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కళాశాలల్లో 2485, ప్రైవేట్ కళాశాలల్లో 3100 సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలలన్నీ నీట్-యుజి (ఎన్‌ఇఇటియుజి) ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి, రాష్ట్ర కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఉంటాయి.

1923లో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రారంభం నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ కేవలం 12 మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఉండాలి అనే తీవ్రమైన ఆకాంక్షలు, అవసరాలు ప్రజలలో ఉన్న కారణంగా 60% కేంద్రం, 40% రాష్ట్రం ఖర్చులను భరిస్తూ, నీతిఆయోగ్ ఇచ్చిన పిపిపి విధానాన్ని ఇతర రాష్ట్రాలు కొన్ని ఆచరించినా, గత ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కళాశాలలు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నిర్మాణానికి పూనుకొన్నది. రూ. 8500 కోట్లకు గాను దాదాపు రూ. 3500 కోట్లు నిధులు నాబార్డ్, ఇతర అనేక సంస్థల నుంచి నిధులు సమీకరించి 2021లో ప్రారంభించారు. ఏడు కాలేజీలు నిర్మాణం పూర్తి అయ్యి 5 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించిన వైనం తెలుసు. దీనితో 750 సీట్లు పెరిగాయి. మిగతా 2 కాలేజీలు పులివెందులకు 50, పాడేరుకు 50 సీట్లు ఎన్‌ఎంసి (నేషనల్ మెడికల్ కౌన్సిల్) కేటాయించగా పులివెందుల సీట్లను నిరాకరిస్తూ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఎన్‌ఎంసికి లేఖ రాసింది. ఇది ఎక్కడి న్యాయం. అసలు ఇపుడు ఎందుకు ఈ చర్చ పిపిపి పద్ధ్దతిలో మెడికల్ కాలేజెస్ నడపాలన్న నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? ఎందుకు ప్రజా ఉద్యమంగా మారుతున్నది? ప్రభుత్వం ఆత్మరక్షణలో ఎందుకు పడుతోంది?

ఆరోగ్య రంగంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకున్న వ్వూహాత్మాక అవసరాన్ని, కొవిడ్ సమయంలో కార్పొరేట్ దోపిడీ ఎంతలా పేద బతుకుల్ని చిదిమేసిందో అర్థం చేసుకొంటే నిధులు లేవనే కారణం చూపి ఇలాంటి నిర్ణయానికి ఒడిగట్టదని విజ్ఞుల అభిప్రాయం. కారణం మన రాష్ట్ర సంవత్సర బడ్జెట్ రమారమీ రూ. 3 లక్షల 20 వేల కోట్లు, అమరావతి నిర్మాణానికి ఇప్పటికి సేకరించిన రుణాలు దగ్గరగా రూ. 70 వేల కోట్లు, ఇంకా రెండవ భూసేకరణకు ఇంకెన్ని కోట్లు వెచ్చిస్తారో తెలీదు. ఇంకో రూ. 5 వేలు కోట్లు. అది కూడా ఒకసారి కాదు సంవత్సరానికి రూ. 500 కోట్లు పెడితే ఎన్‌ఎంసి పర్మిషన్ వున్న, 56 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం మొదలయి ఉన్న మిగతా 10 మెడికల్ కాలేజెస్‌ని సునాయాసంగా పూర్తి చెయ్యవచ్చు. ఈ పది మెడికల్ కాలేజెస్ పూర్తి అయితే ఇంకో 1500 నుంచి 2000 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 17 మెడికల్ కాలేజెస్‌ని పెట్టిన విధానం చూస్తే చాలా వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ ప్రతి 50 కి.మీ.కి ఒక మెడికల్ కాలేజ్, ఒక చైన్ మోడల్‌గా రూపకల్పన చేసారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ హబ్‌గా అనేక నూతన వైద్య పరిశోధనలకు నిలయంగా మారుతుంది.

దాదాపు 30 వేలమందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఈ ఉద్యోగాలులో అన్ని తరగతుల వారికీ రిజర్వేషన్ వర్తిస్తుంది. అంతేకాదు దీనికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్‌లో పేదలకు పూర్తిగా ఉచిత వైద్యం, 650 పడకల ఆసుపత్రి ఎంతో సేవలకి నిలయం అవుతుంది. ఇంతటి విలువైన ప్రజాధనాన్ని, ఆస్తులను ప్రైవేట్ వారికి అతి చవకగా అంటే ఎకరాకి సంవత్సరానికి వంద రూపాయలు చొప్పున 66 ఏళ్లకి లీజుకు ఇవ్వడమే కాదు, రెండు ఏళ్ళు జీతాలు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో, నిర్మాణ దశలో ఉన్న కాలేజీలను పూర్తి చెయ్యకుండా మొత్తం పది (ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలలో. మొదటి విడతలో మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పులివెందుల కాలేజీలను 251.69 ఎకరాలను కేవలం వంద రూపాయలుకు లీజుకి ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్, పార్టనర్‌షిప్ పద్ధతిలో సిద్ధం అయింది. అంటే ప్రజలు ఇచ్చిన భూములు, ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటిని 100% ప్రైవేట్ వారికి లాభాలు చేకూర్చాలని ఆరాట పడుతుంది.

గత అనుభవాలు ఏమి చెప్తున్నాయి?

గతంలో ప్రభుత్వ భూములు తీసుకొని కట్టిన మెడికల్ కాలేజ్ యాజమాన్యాలు మొదట ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందాలు ఏమాత్రం అమలు చేయలేదని 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోసింగ్ కమిటీ నిగ్గుతేల్చి ఇచ్చిన నివేదికను ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. చిత్తూరు మెడికల్ కాలేజీని అపోలోకి అప్పగిస్తే అది ఇపుడు అపోలో మెడికల్ కాలేజీగా మారి పూర్తి ప్రైవేటుపరం అయిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వం ఇచ్చిన జిఒ 107, 108 ప్రకారం 50% సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్‌గా ఇచ్చి మేనేజ్‌మెంట్ కోటా సీటుకి రూ. 12 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ సీటుకి రూ. 20 లక్షలు వసూలు చేస్తున్నారని నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన వ్యతిరేకించాయి. అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లో జిఒ రద్దు అని ప్రతి మీటింగ్‌లో చెప్పారు.

ఇపుడు అధికారం చేపట్టిన 18 నెలల్లో 100% ప్రైవేటీకరణ చేయడం అంటే ప్రజలను, రాష్ట్రాన్ని మోసం చెయ్యడమే. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, మధ్యతరగతి పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ పిపిపి మెడికల్ కాలేజీల మొత్తం నిర్వహణ ప్రైవేట్ భాగస్వాముల చేతుల్లోనే ఉంటుంది. విద్యార్థుల హాస్టళ్ల మెస్ సౌకర్యాలు కూడా ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉంటాయి. అనుబంధ ఆసుపత్రుల్లో 70% పేదవారికి 30% ఇతరులకు అని చెప్తున్నా చివరికి మొత్తం వాణిజ్య పరమైన కార్పొరేట్ విధానం అమల్లోకి వస్తుంది. జీవించే హక్కు ఆర్టికల్ 21 లాగా, విద్యా హక్కు చట్టం లాగా, వైద్యం కూడా ఉచితంగా ఇవ్వాలని, దాన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి అని వైద్య హక్కు చట్టం రావాలి అని మేధావులు చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ పౌరులకు ఉచిత లేదా సార్వత్రిక వైద్యసేవలను అందిస్తున్నాయి. ముఖ్యంగా యూరపులోని నార్వే, యునైటెడ్ కింగ్డమ్ (ఎన్‌హెచ్‌ఎస్), ఇటలీ, స్పెయిన్, కెనడా, స్వీడన్, డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఐస్లాండ్ వంటి దేశాలు పన్నుల ద్వారా నిధులు సమకూర్చి, అందరికీ అందుబాటులో ఉండేలా వైద్య సేవలను అందిస్తున్నాయి. వీటితోపాటు, జపాన్, తైవాన్, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. వైద్య విద్య, వైద్య సేవలలో ఇప్పటికే తీవ్రమైన కొరతలతో ఉండి పేదవారి జీవితం కకావికలం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ప్రైవేటీకరణ చేయడం ఇంకా అసమానతలను పెంచుతుంది. 10 మెడికల్ కాలేజీల పిపిపి విధానాన్ని విరమించి ప్రభుత్వమే ఈ కళాశాలలను నడపాలి. ఆరోగ్యశ్రీ ని హైబ్రిడ్ విధానం పేరుతో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్పొరేట్లకు అప్పగించడం మానుకోవాలి.

డా. వసుంధర(సోషలిస్టు యాక్టివిస్ట్)