Reading Time: 4 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: తోలు తీస్తామన్న వారి నాలుకలు కోస్తా.. మా చిత్తశుద్ధి శంకిస్తే నాలుకలు కోస్తామని, తాను మాట్లాడిన వ్యాఖ్యలు సభలో అన్‌పార్లమెంటరీ అయితే దీనిని రికార్డుల నుంచి తొలగించినా అభ్యంతరం లేదని, కానీ, తా ను చెప్పదల్చుకున్నది నీతిగా, నిజాయితీగా చెబుతున్నానని సిఎం రేవంత్‌రెడ్డి ఉద్వేగంగా అన్నారు. ఏ కోశానా తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా అడ్డుకునేందుకు ముందుంటానని ఆయన స్పష్టం చేశారు. దేవుడి మీద ఆన అని తాను ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనీయనని సిఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. చంద్రబాబుపై ఒత్తి డి తెచ్చి రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్‌ను ఆపిన చరిత్ర నాదని సిఎం అన్నారు. పాలమూరురంగారెడ్డికి 90 టిఎంసీల నీళ్లు రావాల్సిందేనని లేదంటే జూరాల నుంచి రోజు 2 టిఎంసీల నీటిని వాడుకుంటామని ఎవరొచ్చి అడ్డుకుంటారో చూస్తానని, అ నుమతులు రాకపోతే జూరాల నుంచి 70 టిఎంసీల నీటిని తరలించుకుంటామని సి ఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. ప్రాజెక్టుల విషయంలో ఎవరూ అడ్డొచ్చినా సహించేది లేదని, అది జగన్ అయినా, చంద్రబాబు అయినా, ప్రధాని మోడీ అయినా తాడోపేడో తేల్చుకుంటామని ఎవరొస్తారో చూస్తానని ఆయన 

సవాల్ విసిరారు. తాడు, బొంగరం లేనివాళ్లు తమపై విమర్శలు చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చచ్చినా, బ్రతికినా తెలంగాణ కోసమేనని, ఈ మట్టిలోనే కలుస్తామన్నారు. ఇది నా ఒక్కడి మాట కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ తరపున మాట ఇస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. తప్పు, ఒప్పులు ఎవరివో నిజనిర్ధారణ చేయాలని విపక్షాలకు సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణా జలాల వివాదంలో నిజనిర్ధారణకు కెసిఆర్, హరీష్‌రావుల నేతృత్వంలో కమిటీ వేయాలని, విపక్ష నాయకులతో పాటు తమ పార్టీ సభ్యులు కూడా వస్తారని సిఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం అసెంబ్లీలో ‘నీళ్లు…నిజాల’పై జరిగిన స్వల్పకాలిక చర్చల్లో పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి దాదాపు రెండుగంటల పాటు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

సభలో మాటల గారడీలకు స్థానం లేదు

సభలో మాటల గారడీలకు ఇక్కడకు స్థానం లేదని, ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ఇది వేదిక కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ సభ అని సిఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. బహిరంగ సభల్లో మాట్లాడే దానికంటే ఈ సభలో మాట్లాడే ప్రతిమాటపై ప్రజల్లో నమ్మకం ఉంటుందని ఆయన తెలిపారు. గడిచిన రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదని, సభకు రావాలని తాను కెసిఆర్‌ను పదే పదే విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. అయినా, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ సభకు రాలేదని ఆయన అన్నారు. సభకు తాము రామని, చర్చలో పాల్గొనమని హరీష్ రావు మాట్లాడటం చట్టసభలను అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌రావుకు సభలో మాట్లాడడానికి స్పీకర్ అవకాశం ఇచ్చారని అయినా సభకు రానని వెళ్లిపోయారని ఆయన విమర్శించారు.

కెసిఆర్‌కు ప్రజలకంటే పార్టీకి, పార్టీ మీటింగ్‌లకే విలువ…

వలసల జిల్లా పాలమూరు బిడ్డగా కరువు కష్టాలు, పేదరికం ఎలా ఉంటుందో తనకు పూర్తిగా తెలుసనీ సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, ఇందుకు కాంగ్రెస్ కారణమని కెసిఆర్ విమర్శించడం తప్పని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎలా ఉపయోగ పడతాయో, ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి తన అనుభవంతో కెసిఆర్ సూచనలు ఇస్తారని అనుకున్నామని, అందులో భాగంగా కృష్ణా జలాలపై ఒకరోజు, గోదావరి జలాలపై ఒకరోజు సభలో చర్చిద్దామని కెసిఆర్‌ను అసెంబ్లీకి రావాలని ఆహ్వానించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కెసిఆర్‌కు ప్రజలకంటే పార్టీకి, పార్టీ మీటింగ్‌లకే విలువ ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో చట్టసభల పట్ల బిఆర్‌ఎస్‌కు ఉన్న చిన్నచూపు మరోసారి బయటపడిందని ఆయన తెలిపారు. కెసిఆర్ సభకు రాకపోకపోవడానికి కారణాలు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఈ సారి సభలో ఎవరూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేయలేదని, దీనిపై అవసరమైన నిజనిర్ధారణ కమిటీ వేయాలని ఆయన సూచించారు.

బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాజలాల్లో 75 శాతం నీటిలభ్యత

బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణాజలాల్లో 75 శాతం నీటిలభ్యత అంచనాల ప్రకారం మొత్తం 2,130 టిఎంసిల నీటిని కేటాయించారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టిఎంసీలు, మహారాష్ట్రకు 585 టిఎంసీలు, కర్ణాటకకు 811 టిఎంసీలను కేటాయించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేసుకోవాల్సి ఉండేదని, నికర జలాలు, మిగులు జలాల వేర్వేరుగా నీటి కేటాయింపులు జరిపారన్నారు. కృష్ణా నదిపై ఉన్న వివిధ రాష్ట్రాల ఫిర్యాదుల కారణంగా 2004 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిన 2,130 టిఎంసిల నీటి కేటాయింపులను కొనసాగిస్తూనే,

అదనపు నీటి లభ్యత అంచనాలతో 2,578 టిఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా పరీవాహకంలో ఉన్న రాష్ట్రాలకు పంపిణీ చేసిందన్నారు. దీని ప్రకారం మహారాష్ట్రకు 666 టిఎంసీలు, కర్ణాటకకు 907 టిఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,005 టిఎంసిల నీటి వాటాలు కేటాయించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపి మధ్య నీటి వాటాల పంపిణీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని పునర్విభజన చట్టంలో ఉందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఈ ప్రాజెక్టులను బిఆర్‌ఎస్ అసంపూర్తిగా వదిలేసింది

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసిందన్నారు. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్‌లో ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టిందని, 2014లో అధికారం చేపట్టిన బిఆర్‌ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సింది పోయి అసంపూర్తిగా వదిలేసిందన్నారు.

రెండో అఫెక్స్ సమావేశంలోనూ 299 టిఎంసిలే చాలనీ….

490 టిఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 5 సంవత్సరాలు ఇరిగేషన్ బాధ్యతలను కెసిఆర్, 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావులు బాధ్యతలు చేపట్టి తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 జూన్‌లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టిఎంసీలకు కెసిఆర్ అంగీకరించారని ఆయన తెలిపారు. ఉమ్మడి ఏపికి కేటాయించిన 811 టిఎంసీలో తెలంగాణకు 490 టిఎంసీలు అడగాల్సింది పోయి 299 టిఎంసీలకు ఒప్పుకొని సంతకం పెట్టారన్నారు. 21.09.2016వ తేదీన జరిగిన అఫెక్స్ సమావేశంలోనూ మనకు 299 టిఎంసీలు చాలని కెసిఆర్ తాత్కాలిక నీటి వాటాలకు ఒప్పుకొని వచ్చారన్నారు. 06.10.2020లో జరిగిన రెండో అఫెక్స్ సమావేశంలోనూ ఈ కేటాయింపులే కొనసాగించాలని శాశ్వతంగా ఒప్పుకున్నారన్నారు.

సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించిన జానారెడ్డి, భట్టి

గతంలో బిఆర్‌ఎస్ నేతలు అవమానించినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు వచ్చి మాట్లాడేవారని, ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో మాట్లాడకుంటే అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చిందే కెసిఆర్ అని ఆయన గుర్తుచేశారు. అందుకే కెసిఆర్ సభకు రావాలని తాము పదే పదే విజ్ఞప్తి చేశామని అన్నారు. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరూ సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించారని ఆయన అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజా సమస్యలు లేవనెత్తారన్నారు.

ఎంపిగా కెసిఆర్ ఉన్నప్పుడు పాలమూరు ఎత్తిపోతలను ఇవ్వాలని…

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టాలని మొట్టమొదట 2009లో అప్పటి ఎంపి విఠల్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డికి లేఖ రాశారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చరిత్రలో పాలమూరు రంగారెడ్డికి ఎలా పునాదులు పడ్డాయో తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని, విఠల్‌రావును ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోట్లాడి పాలమూరు రంగారెడ్డిని సాధించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో మహబూబ్‌నగర్ ఎంపిగా ఉన్న కెసిఆర్ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ఇవ్వాలని అడగలేదని, ఏ నైతిక హక్కుతో కెసిఆర్ ఇవాళ మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

జూరాల ఆధారంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించాలని…

జూరాల నుంచి రోజుకు 2 టిఎంసీల చొప్పున 70 టిఎంసీల వరద జలాలను మళ్లీంచి సాగునీటిని అందించేందుకు పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రం 2013 సంవత్సరంలో ఆమోదం తెలిపిందన్నారు. జూరాల నుంచి 70 టిఎంసీల వరద జలాలతో పాలమూరు ప్రాజెక్టు సర్వేతో పాటు డిపిఆర్ తయారు చేయాలని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్‌సిఐ) వాళ్లకు ఈ జీఓ ద్వారా బాధ్యతలు అప్పగించిందన్నారు. జూరాల ఆధారంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించాలని ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ ఫోరానికి చెందిన నిపుణులు, ఇంజనీర్లు సూచించారని సిఎం తెలిపారు. 26 రోజుల తర్వాత ఈ ప్రాజెక్టును కెసిఆర్ పథకం ప్రకారం మళ్లీంచారని, జూరాల నుంచి కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలం నుంచి మార్చాలని ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. జూరాల వద్ద నిర్మించే పంపులకు రూ.5,185 కోట్లుగా అంచనా వేస్తే సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి పంపులు, లిప్టుల సంఖ్యను పెంచారని ఆయన ఆరోపించారు. 37 పంపులకు గాను రూ.10,335 కోట్లకు అంచనాలను పెంచారని ఆయన అన్నారు.