Reading Time: 3 minutes

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభకు వచ్చినా, రాకున్నా వార్తే అని గత వారం మాట్లాడుకున్నాం. అప్పటివరకు ఇంకా ఆయన సభకు వస్తారా లేదా అన్న విషయం ఇదమిత్థంగా బయట ఎవరికీ తెలియదు. ఆయన శాసనసభకు హాజరుకావచ్చునేమో అనే సంకేతాలు ఇచ్చే విధంగా అంతకుముందు రెండు రోజుల పరిణామాలు కనిపించాయి. రెండు రోజులముందు ఆయన చాలాకాలం తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బంజారాహిల్స్ లోని నందినగర్ లో తన స్వగృహానికి చేరుకొని తెలంగాణభవన్ లో పార్టీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పార్టీ నడుచుకోవాల్సిన తీరు మీద, ఇతర అంశాల మీద దిశానిర్దేశం చేయడంతో ఆయన సభకు కూడా హాజరు కావచ్చునని సంకేతాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా కెసిఆర్ తోలు తీస్తానంటే బదులుగా లాగులో తొండలు తోలుతానన్న ముఖ్యమంత్రి మాటలు అలా ఉంచితే మొత్తానికి ఆయన సభకు వచ్చారు.

తొలి రోజున సభ ప్రారంభం అయ్యే ముందు అక్కడ నెలకొన్న వాతావరణం సభ సజావుగా జరగవచ్చునన్నట్టు కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సభలో ప్రతిపక్ష బెంచీల వైపు స్వయంగా నడిచి వచ్చి చంద్రశేఖరరావుకు అభివాదం చేయడం, ఆయన ఆరోగ్యాన్ని గురించి వాకబు చేయడం, కెసిఆర్ సహా ఆయన పార్టీ శాసనసభ్యులు పలువురు లేచి ముఖ్యమంత్రికి ప్రత్యభివాదం చేయడం అందుకు కారణం.

కెసిఆర్ అసాంతం సభలో ఉండి వివిధ అంశాల మీద జరిగే చర్చలో తనకున్న అనుభవాల నేపథ్యంలో సూచనలు, సలహాలు ఇస్తారని, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఎవరైనా భావిస్తారు. కానీ అలా జరగలేదు. ఆయన మూడంటే మూడు నిమిషాలు సభలో కూర్చుని, హాజరు పట్టీలో సంతకం చేసి వెళ్లిపోయారు. ఇటీవలే మరణించిన మాజీ శాసనసభ్యుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సభ నివాళులర్పిస్తుంటే కనీస మర్యాదగానైనా ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు సభలో ఉండకుండా వెళ్లిపోయారని కెసిఆర్ మీద విమర్శలు కూడా వచ్చాయి.

నూతన సంవత్సరం వేడుకల కారణంగా సభకు ఏర్పడిన విరామం అనంతరం రెండవతేదీ నుండి మూడు నాలుగు రోజులపాటు సభ జరిగి అందులో కృష్ణా, గోదావరి జలాల వాటా గురించి, వాటిపైన రావలసిన ప్రాజెక్టుల గురించి చర్చ జరుగుతుందని, అప్పుడు కెసిఆర్ హాజరవుతారనీ అనుకున్నారు. కానీ ఒకరోజు ముందు నూతన సంవత్సరం తొలి రోజున ఆయన శాసనసభ, శాసనమండలిలో ఉపనాయకులను నియమించడంతో ఇక ఆయన సభకు రారన్న విషయం స్పష్టమైంది. శాసనసభలో సీనియర్ నాయకుడు, మాజీమంత్రి హరీశ్ రావుతో సహా మరో ఇద్దరు మాజీమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను ఉప నాయకులుగా నియమించారు.

శాసనసభలో ఇకపై భారత రాష్ట్ర సమితికి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తారని అర్థం చేసుకోవాలి. ఈ నియామకానికి మరో మాజీ మంత్రి కె.టి.రామారావు వ్యతిరేకమనీ, అందుకే సభలో హరీశ్‌రావు బిఆర్‌ఎస్ సభ్యులకు నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోకుండా, తన సమర్థతను రుజువు చేసుకోకుండా ఉండేందుకు కెసిఆరే సభా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని సామాజిక మాధ్యమాలు చిలవలు పలవలు చేసి రాసాయి. అదే నిజమయితే అసలు హరీశ్ రావును ఉప నాయకుడిగా నియమించకుండా ఉండొచ్చన్న మాట ఈ ప్రచారం చేస్తున్న వాళ్లకు తట్టలేదు పాపం. ఈ నియామకాలు జరిపి కెసిఆర్ మళ్ళీ ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోయారు. తన స్థాయివారో, సమవుజ్జీలో సభలో లేరు కాబట్టి శాసనసభకు తాను రాకుండా బాధ్యతలు కింది నాయకులకు అప్పగించారని అనుకుంటే వారు కూడా సభను ఈ సెషన్ వరకు బహిష్కరించారు.

నిజానికి ఏదైతే వివాదాస్పదం అవుతుందని, భారత రాష్ట్ర సమితి కూడా కొంత ఇరకాటంలో పడవచ్చునని అనుకుంటున్న నదీ జలాల మీద చర్చ ఇంకా ప్రారంభం కాకుండానే బిఆర్‌ఎస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే శాసనసభ వెలుపల ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నదీజలాల వ్యవహారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేశారు. భారత రాష్ట్ర సమితి తన పార్టీ కార్యాలయంలో మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది. ఇంకా దీని మీద శాసనసభలో మాట్లాడుకునేది ఏముంటుంది అనుకునే భారత రాష్ట్ర సమితి సభను బహిష్కరించిందా?

నదీ జలాల మాట ఎలా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి మహాత్ముని పేరు తొలగించడంతో, దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్చ సందర్భంగా సభలో ఉండకుండా వెళ్లిపోయి బిజెపి అనుకూల వైఖరి తీసుకున్నారన్న విమర్శ మాత్రం భారత రాష్ట్ర సమితి ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఏది ఎలా ఉన్నా ఈ శాసనసభ ఇంకా మూడు సంవత్సరాలు కొనసాగవలసి ఉన్నది. సభకు హాజరై తమ వాదనలు వినిపించి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం తప్పులు చేస్తే వాటిని నిలదీసి మళ్లీ ప్రజామోదం కోసం ప్రయత్నించాల్సింది పోయి బిఆర్‌ఎస్ ఇటువంటి వైఖరి తీసుకోవడం ఆత్మహత్యాసదృశం అవుతుందేమో ఆలోచించుకోవాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతే వచ్చే ఎన్నికలలో మళ్లీ తమను ప్రజలు గద్దెనెక్కించేందుకు తోడ్పడుతుందని చంద్రశేఖరరావు కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ భావిస్తూ ఉంటే పొరపాటు.

ఇక్కడ బిఆర్‌ఎస్ బహిష్కృత నేత, జాగృతి నాయకురాలు కవిత శుక్రవారంనాడు శాసనమండలి వెలుపల చేసిన వ్యాఖ్యలను గురించి మాట్లాడుకోవాలి. కవిత కూడా కెసిఆర్ సభకు రావాల్సిందే అంటున్నారు. ఆయన తనమీద వచ్చిన ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిందేనని చెప్తున్నారు. లేకపోతే బిఆర్‌ఎస్‌ను దేవుడు కూడా రక్షించలేడని ఆమె వ్యాఖ్యానించారు. సభకు హాజరుకాకుంటే, ఆరోపణల మీద వివరణ ఇవ్వకుంటే బిఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదని కవిత భావిస్తున్నట్టే టిఆర్‌ఎస్ కింది శ్రేణి నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు సభలో మాట్లాడే అవకాశం రానప్పుడు ఇంకా సభకు ఎందుకు వెళ్లాలి అనే వాదన సరైంది కాదని వారి అభిప్రాయం.

రాజకీయాల్లో ప్రత్యర్ధులు.. బద్ధ శత్రువులుగా మారిపోయిన రోజులివి. ఆ కారణం చేతనే చట్టసభల్లో కూడా చర్చలు కాకుండా యుద్ధాలు జరుగుతున్నాయి, మాటల యుద్ధాలే అనుకోండి. ఇటువంటి వాతావరణంలో అధికారపక్షం ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇవ్వడం అనేది బాగా తగ్గిపోయింది. ఇది ఇవాళ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నది కాదు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా కూడా చట్టసభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశాలు లేకుండా చేయడమే కాదు, అసలు ప్రతిపక్షం లేకుండా చేసిన సందర్భాలున్నాయి కదా. అంతమాత్రం చేత సభను వదిలేసి వెళ్లడం కాకుండా అవకాశం కోసం ప్రయత్నించి తమ వాదన సభ ద్వారా ప్రజలకు తెలిపే ప్రయత్నం చేయడం ప్రతిపక్షాల బాధ్యత. ప్రతిపక్షం బయటకు వెళ్ళిపోతే సభ రికార్డుల్లో అధికారపక్షం ఏం మాట్లాడితే అదే మిగిలిపోతుంది.

ఇక కవిత విషయానికే వస్తే ఆమె పార్టీ వీడిననాటి నుండి నేటివరకు కూడా ప్రధానంగా లక్ష్యం చేసుకున్నది హరీశ్ రావుని. అటువంటిది ఇప్పుడామె నేరుగా తన తండ్రి, పార్టీ అధినేత చంద్రశేఖరరావును కూడా విమర్శించడం విశేషం. ఆయన పాలమూరు -రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో సభకు వచ్చి చెప్పాలంటున్నారు. ఓ పక్క కెటిఆర్, హరీశ్ పిల్లకాకులు అంటూనే మరోపక్క పాలమూరులో ప్యాకేజీ హరీశ్ రావు అమ్ముకున్నారంటున్నారు. అదే నిజమయితే పెద్దాయన అనుమతి లేకుండా పిల్లకాకులు స్వతంత్రంగా ఏం చేయగలవు?

రేపు మండలిలో తన రాజీనామాకు సంబంధించి కవిత చెప్పబోయే కారణాలు బిఆర్‌ఎస్‌కు ఎంత నష్టం చేయబోతున్నాయో చూడాలి. అంతేకాదు, ఆమె చెబుతున్నట్టుగా 2028లో సొంత పార్టీ పెట్టి పోటీ చేస్తే బిఆర్‌ఎస్‌కు మరింత నష్టం జరుగుతుందా? తాను తెలంగాణ ప్రజలు విడిచిన బాణాన్నని కవిత చెబుతుంటే ఆమె విసురుతున్న విమర్శనాస్త్రాలు బిఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టడమే కాదు, అధికార కాంగ్రెస్ అమ్ములపొదిలో నుండి వేసిన బాణాల్లా ఉండటంతో కవిత రేవంత్ విడిచిన బాణం అనే ప్రచారానికి ఊతం ఇచ్చినట్టవుతున్నది.

దేవులపల్లి అమర్