
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటులో ఇది చరిత్రలో అతిపెద్ద ఆయుధాలతో లొంగుబాటని డిజిపి బి.శివధర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు అగ్రనేత, పిఎల్‌జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్ కమాండర్ బడిసే సుక్కా అలియాస్ దేవా అలియాస్ దర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజరెడ్డి అలియాస్ వెంకటేష్‌లు మరో 18 మంది మావోయిస్టులతో కలిసి శనివారం రాష్ట్ర డిజిపి శి వధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. అనంతరం ఎస్‌ఐబి చీఫ్ సుమతి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్‌కుమార్‌లతో కలిసి డిజిపి మీడియా సమావేశం లో మాట్లాడారు. ఈ లొంగుబాటుతో పిల్‌జిఏ మొత్తం దాదాపుగా పతనమయ్యిందన్నారు. పతనం అంచున పార్టీ ఉందని, బెటాలియన్‌లో ఉన్న వారందరూ లోంగిపోవాలని డిజిపి పిలుపునిచ్చారు. సమయం మించిపోతోందని, మిగిలిన వారు బయటకు రావాలని కోరారు. లొంగిపోయిన వారు ప్రభుత్వ సంక్షేమ, పునరావాస పథకాలు నచ్చడం, అనారోగ్య కారణాలు, సిద్దాంతపరమయిన విభేదాలతో లొంగిపోయినట్లు డిజిపి చెప్పారు.
పిఎల్‌జీఏ బెటాలియన్‌లో 400 మందికి పైగా ఉండేవారని, ప్రస్తుతం ఈ సంఖ్య 66కు తగ్గిపోయిందన్నారు. రాష్ట్రం నుండి 52 మంది మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు ప్రచారంలో ఉండేదని అయితే, కేవలం 17 మంది మాత్రమే ఉన్నారని, ఇది ప్రస్తుతం లొంగిపోయిన వారు చెప్పిన ఖచ్చితమయిన సమాచారమని డిజిపి వెల్లడించారు. వారిలో నలుగురు కేంద్ర కమిటీ, ఐదుగురు రాష్ట్ర కమిటీ, ముగ్గురు డివిజన్ కమిటీ, నలుగురు ఏరియా కమిటీ, ఒక్కరు పార్టీ సభ్యులుగా ఉన్నారని వివరించారు. మిగిలిన 35 మంది సమాచారం ప్రస్తుతం లొంగిపోయిన వారి వద్ద కూడా లేదని డిజిపి స్పష్టం చేశారు. కాగా, ఇప్పటి వరకు మొత్తం 576 మంది రాష్ట్ర పోలీసుల వద్ద లొంగిపోయినట్లు డిజిపి వెల్లడించారు. జనజీవనంలో చేరిన 20 మంది మావోయిస్టులందరికి కోటి 81లక్షల 90 వేల రూపాయలు రివార్డు అందిస్తామన్నారు. తక్షణ సాయంలో భాగంగా ఒక్కొక్కరికి రూ. 25 వేలు తాత్కాలిక ఉపశమనంగా అందచేశారు. ప్రభుత్వం అందించే పునారావాస పథకాలు, ఇతర ప్రయోజనాలు త్వరగా అందచేస్తామని డిజిపి స్పష్టం చేశారు.
హిడ్మా ప్రభావంతో పార్టీలో చేరిన దేవా
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన బడిసే దేవాది, ఇటీవల మృతి చెందిన హిడ్మాది ఒకే గ్రామం కావడంతో ఆయన ప్రభావంతో దేవా 2003లో పార్టీలో చేరాడు. హి డ్మాతో కలిసి సైనిక వ్యూహాలు, పేలుడు పదార్థాల సేకరణ, తుపాకీల తయారీ, ఐఇడి తయారీలలో నిపుణుడిగా తయారయ్యాడు. జైరామ్ ఘాటి లాంటి అకస్మిక దాడులు, కాంగ్రెస్ నాయకుడు, మంత్రి మహేంద్ర కర్మ హత్య దాడిలో కీలకంగా వ్యవహరించా డు. దేవాపై తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతో పాటు ఎన్‌ఐఏ రివార్డులతో కలిపి రూ. 75 లక్షల రివార్డు ఉంది. కాగా, మీడియాతో దేవా మాట్లాడుతూ జనజీవన స్రవంతిలోకి రావడానికి అనుకూలమయిన వాతావరణం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, అందుకు ధన్యావాదాలు అని కోయ బాషలో చెప్పారు.
29 ఏళ్లుగా అజ్ఞాతంలో రాజిరెడ్డి
రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా, కాల్వ శ్రీరాంపురం మండలం, కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ సుమారు 29 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. డివిజన్ కమిటీ సభ్యుడిగా 2010లో, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా 2019లో పదోన్నతి పొందాడు. కర్రెగుట్టల్లో గెరిల్లా స్థావరాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.
భారీగా ఆయుధాలు అప్పగింత
లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు పోలీసులకు భారీగా ఆయుధాలను అప్పగించారు. మావోయిస్టులు 48 ఆయుధాలు, 2206 రౌండ్ల తూటాలు అప్పగించినట్లు డిజిపి చెప్పారు. వాటిలో రెండు ఎల్‌ఎంజిలు, ఒక అమెరికా తయారీ కోల్ట్ రైఫిల్, ఒక ఇజ్రాయోల్ తయారీ తవార్ గన్, ఎనిమిది ఎకే 47 గన్స్, పది ఇన్సాస్, ఎనిమి ది ఎస్‌ఎల్‌ఆర్, నాలుగు బిజిఎల్, 11 సింగిల్ షాట్స్, రెండు గ్రేనేడ్స్, ఒక ఎయిర్ గన్, హెలికాప్టర్ కూల్చే 19 షాట్స్‌తో పాటు వారి వద్ద ఉన్న రూ. 20 లక్షల 30 వేలు నగదు అప్పగించినట్లు డిజిపి వెల్లడించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు అందచేస్తామని ఆయన తెలిపారు. ఎల్‌ఎంజికు రూ.5 లక్షలు, ఎకే 47కు రూ.4 లక్షలు, ఇన్సాన్‌కు రూ. 2 లక్షలు, ఎస్‌ఎల్‌ఆర్ కు రూ. 2 లక్షలు, పాయింట్ 303 గన్‌కు ఒక లక్ష, యుజిబిఎల్ కు రూ.40వేలు, 12బోర్, సింగిల్ షాట్ గన్‌కు రూ.30 వేల చొ ప్పున రివార్డు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద మొ త్తంలో ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోవడం అరుదుగా ఉంటుందని, ఇది రాష్ట్ర పోలీసుల విజయంగా అభివర్ణించారు.
దేవ్‌జీ గురించి నాకు సమాచారం లేదు : రాజరెడ్డి
మీడియా సమావేశంలో కంకణాల రాజిరెడ్డి మాట్లాడుతూ దేవ్‌జీతో తాను దూరంగా ఉన్నానని, ఆయన గురించి తనకు సరయిన సమాచారం లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక, సాంకేతి పరిజ్ఞానంతో సాయుధ పోరాటం సాధ్యం కాదని, సాయుధ పోరాటానికి పరిస్థితులు అనుకూలంగా లేవని రాజిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పనిచేసే మావోయిస్టులు, రాష్ట్రానికి చెందిన వారు కూడా త్వరగా లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలోకి కలిస్తే ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు అందిస్తుందని, వాటికి ఆకర్షితులు కావడంతో పాటు అనారోగ్య కారణాలతో లొంగిపోయామని రాజిరెడ్డి తెలిపారు.