Reading Time: 2 minutes

మన పర్యాటకానికి దివ్య ఖ్యాతి!..నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’ నివేదికలో రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు

Caption of Image.
  • 408 పేజీల రిపోర్టులో తెలంగాణకు 7 పేజీల కేటాయింపు
  • ప్రకృతి, ఆధ్యాత్మికత, రుచులకు పెద్దపీట
  • రాష్ట్ర సందర్శనకు అక్టోబర్‌‌ నుంచి ఏప్రిల్ వరకు ఉత్తమ సమయమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశంలోని పర్యాటక రంగం రూపురేఖలను మార్చేలా నీతి ఆయోగ్ రూపొందించిన ‘దివ్య భారత్’ నివేదికలో మన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రసిద్ధ ‘లోన్లీ ప్లానెట్’ట్రావెల్ గైడ్ తరహాలో రూపొందించిన ఈ నివేదికలో మన రాష్ట్ర పర్యాటక వైభవాన్ని నీతి ఆయోగ్ కొనియాడింది. మొత్తం 408 పేజీలతో కూడిన ఈ నివేదికలో తెలంగాణ పర్యాటక ప్రాంతాల కోసం ప్రత్యేకంగా 7 పేజీలను కేటాయించడం విశేషం. తెలంగాణను సందర్శించడానికి అక్టోబర్‌‌ నుంచి ఏప్రిల్ వరకు అత్యంత అనుకూలమైన సమయమని నివేదిక పేర్కొంది.

ప్రకృతి ఒడిలో.. ఆధ్యాత్మిక వెలుగులో..

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలుగా నీతి ఆయోగ్ విభజించింది. వినోద ప్రాంతాల్లో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, ఫలక్‌నుమా ప్యాలెస్, మృగవని నేషనల్ పార్క్, గోల్కొండ, మౌలాలీ కొండలు, షామీర్‌పేట వంటి ప్రాంతాలను హైలైట్ చేసింది. ప్రకృతి అందాల్లో అనంతగిరి కొండలు, లక్కవరం చెరువు, నాగర్జునసాగర్, పాండవుల గుట్టతోపాటు కుంటాల, బొగత జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొంది. వన్యప్రాణుల సంరక్షణలో ఏటూరునాగారం, కిన్నెరసాని, కవ్వాల్ టైగర్ రిజర్వ్​లకు చోటు కల్పించింది. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో యాదగిరిగుట్ట, బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, భద్రాద్రి రామాలయం, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, కొండగట్టు అంజన్న, జోగులాంబ ఆలయం, చిలుకూరు బాలాజీ వంటి పుణ్యక్షేత్రాల విశిష్టతను వివరించింది.

బిర్యానీ, హస్తకళలకు ఫిదా.. 

తెలంగాణ అనగానే గుర్తొచ్చే బిర్యానీతో పాటు స్థానిక వంటకాలకు నీతి ఆయోగ్ ఫిదా అయ్యింది. హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి, పచ్చిపులుసు వంటి వంటకాలను నివేదికలో పొందుపరిచింది. ఇక హస్తకళల విభాగంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట చీరలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చింది. అదేవిధంగా తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే సమ్మక్క -సారలమ్మ మేడారం జాతర, నాగోబా జాతర, బతుకమ్మ, పీర్ల పండుగ, డెక్కన్ 
ఫెస్టివల్ వంటి ఉత్సవాల గురించి నివేదికలో వివరించింది.

ఇది తెలంగాణకు గర్వకారణం: మంత్రి జూపల్లి

నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’నివేదికలో తెలంగాణకు దక్కిన గుర్తింపుపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర పర్యాటక రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమన్నారు. చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి అందాలను తిలకించేందుకు దేశ, విదేశీ పర్యాటకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.