Reading Time: 2 minutes

పోలీసుల ముందే.. ఎమ్మెల్యేను చెంప దెబ్బకొట్టిన యువకుడు

Caption of Image.

గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో అగ్నిప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే చైతర్ వాసవపై  దాడి సంచలనంగా మారింది. ఎమ్మెల్యే ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడం…అతను తిరిగి ఎమ్మెల్యేను కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  శాంతియుతంగా జరగాల్సిన నిరసన ఒక్కసారిగా హింసాత్మకంగా మారడంతో ఝగాడియా పారిశ్రామిక ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

అసలేం జరిగిందంటే.. ఏప్రిల్ 23న స్థానిక ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు  కార్మికులు ప్రాణాలు కోల్పోగా..15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే  మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సరైన ఆర్థిక సహాయం, న్యాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వాసవ తన మద్దతుదారులతో కలిసి ఝగాడియా జీఐడీసీలోని మెట్రోపాలిటన్ ఎక్సికెమ్ కంపెనీ వద్దకు చేరుకున్నారు.

కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి బాధితులకు అధిక నష్టపరిహారం ఇప్పించాలన్నదే నిరసనకారుల ప్రధాన డిమాండ్. అయితే ఈ లోపే సీన్ రివర్స్ అయింది. మృతుల్లో ఒకరి బంధువునని చెప్పుకున్న ఒక వ్యక్తి ఎమ్మెల్యే వాసవను నిలదీయడంతో వాగ్వాదం మొదలైంది. మాట మాట పెరగడంతో  పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.  వాగ్వాదం జరుగుతుండగా..  ఆప్  ఎమ్మెల్యే వాసవ ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టారు. దీనికి ప్రతిగా ఆ వ్యక్తి కూడా ఎమ్మెల్యేపై  దాడి చేసి దుర్భాషలాడాడు. పోలీసు అధికారుల కళ్ల ముందే ఈ ఘర్షణ జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

ఈ ఘటన కేవలం రాజకీయ వివాదానికే పరిమితం కాలేదు.. గుజరాత్‌లో పారిశ్రామిక భద్రత, జవాబుదారీతనంపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చింది. మరి ఈ వివాదం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.