Reading Time: 2 minutes

మీకు తెలుసా ఇది పచ్చి నిజం: సెకనుకు 3 వేల డాలర్లు సంపాదిస్తున్న అమెరికా ఆయిల్ కంపెనీలు

Caption of Image.

ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు.. పేదోడు మరింత పేదోడు అవుతున్నాడు.. అవును ఇది నిజం. మనం కరెంట్ బిల్లు, ఇంటి అద్దె కట్టటానికే కష్టపడుతున్నాం.. అలాంటిది అమెరికాలోని అతి పెద్ద ఆయిల్ కంపెనీలు.. సెకనుకు 3 వేల డాలర్లు సంపాదిస్తున్నాయి.. ఇప్పటి వరకు మేం రాసింది.. మీరు చదివే టైంలోనే.. ఆ ఆయిల్ కంపెనీలు 3 వేల డాలర్లు సంపాదించాయి.. సెకనుకు 3 వేల డాలర్లు అంటే.. మన కరెన్సీలో.. 2 లక్షల 82 వేల రూపాయలు.. జస్ట్ సెకను అంటే ఒక్క సెకనులో.. కళ్లు మూసి అలా తెరిచే సమయంలో వాళ్లు ఈ 2 లక్షల 82 వేల రూపాయలు సంపాదించేస్తున్నారు.. అదే ఇండియాలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం ఏడాది మొత్తం కష్టపడినా ఇంత సంపాదించలేరు కదా..

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. మిడిల్ ఈస్ట్ వార్‏తో ఆయిల్ రవాణాకు ఆటంకం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశనంటుతున్నాయి. ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర సెంచరీ క్రాస్ చేసింది. ఓ వైపు చమురు కొరత ప్రపంచదేశాలు అల్లాడిపోతుంటే.. మరోవైపు రికార్డ్ స్థాయి లాభాలతో ఆయిల్ కంపెనీల పంట పండుతోంది. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచంలోని ఆరు అతిపెద్ద చమురు కంపెనీలు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను గడించినట్లు ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. 

ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలోని ఆరు అతిపెద్ద ఆయిల్ కంపెనీలైన చెవ్రాన్, షెల్, బిపి, కోనోకోఫిలిప్స్, ఎక్సాన్ మొబిల్, టోటల్ ఎనర్జీస్ 2026లో ప్రతి సెకనుకు దాదాపు మూడు వేల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో 2 లక్షల 82 వేలు) లాభాన్ని ఆర్జిస్తున్నాయి. ప్రపంచ చమురు సంక్షోభ సమయంలో ఈ ఆరు కంపెనీలు కలిసి ఈ ఏడాది మొత్తం 94 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని ఆర్జిస్తాయని అంచనా. 2025తో పోలిస్తే ఈ కంపెనీలు ప్రతిరోజూ అదనంగా 37 మిలియన్ల లాభాన్ని గడిస్తున్నాయి.

ఒకవైపు ఆయిల్ కంపెనీలు కళ్లు మూసి తెరిచే రెప్పపాటు సమయంలో సెకనుకు 3 వేల డాలర్ల రికార్డ్ స్థాయి లాభాలు గడిస్తుంటే.. మరోవైపు అమెరికా వంటి అగ్ర దేశాల్లోని సామాన్య కుటుంబాలు ఆకాశనంటుతున్న విద్యుత్, ఇంధన బిల్లులను చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చమురు కంపెనీల లాభాలు, కుటుంబాలపై పెరిగిన భారం ఈ రెండింటికీ ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే. 

దాదాపు రెండు నెలలుగా సాగుతోన్న అమెరికా ఇరాన్‌ యుద్ధం ఫలితంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మీదుగా రాకపోకలు స్తంభించిపోయాయి. హార్మూజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్ పోటాపోటీ ఆంక్షల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. ఒక దేశ అధిపత్యం కోసం మొదలైన ఈ యుద్ధం ఆయిల్ కంపెనీలకు లాభాల వర్షం కురిపిస్తుంటే.. అదే సమయంలో సామాన్య జనానికి ప్రాణసంకటంగా మారింది.  

©️ VIL Media Pvt Ltd.