
డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే అకౌంట్ ఎవరిదో వాళ్లను తీసుకురమ్మని బ్యాంకు సిబ్బంది అతనికి హుకుం జారీ చేశారు. ఆమె చనిపోయిందని చెప్పినా వినిపించుకోలేదు. అతని గోడు ఎవరికి చెప్పుకున్నా తన అక్క అకౌంట్లో ఉన్న డబ్బులు అతనికి ఇప్పించలేకపోయారు.
In #Odisha, a man dug up his deceased sister’s skeleton and brought it to a bank, all to prove she had died. He’d been trying to withdraw $240 from her account, but bank staff kept demanding the account holder show up in person. Ignorant of legal procedures and pushed to his… pic.twitter.com/C29DM0ubAJ
— WILD WORLD DAILY (@WildWorldDaily) April 28, 2026
ఆమె చనిపోయిందని.. తాను చెబుతుంది నిజమని ఎన్ని సార్లు బ్యాంకు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా పని కాలేదు. తమకంటూ కొన్ని రూల్స్ ఉంటాయని.. అకౌంట్ హోల్డర్ను చూడందే డబ్బులిచ్చేది లేదని బ్యాంకు సిబ్బంది తెగేసి చెప్పారు. దీంతో.. తిక్కరేగిన ఆ పెద్దాయన చచ్చిపోయిన తన సోదరి అస్థి పంజరాన్ని భుజానేసుకుని బ్యాంకుకు వెళ్లాడు.
ఈ వింత ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒక గిరిజన వ్యక్తి సోమవారం తన సోదరి పేరు మీద జమ చేసిన డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ఆమె మరణించిన అస్థి పంజరాన్ని బ్యాంకుకు తీసుకువెళ్లాడని పోలీసులు చెప్పారు. తన సోదరి అస్థి పంజరాన్ని ఆ పెద్దాయన సంచిలో మూటగట్టుకుని రోడ్డుపై వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.
ఈ ఘటన కియోంఝర్ జిల్లాలోని పటానా బ్లాక్‌లో ఉన్న ఒడిశా గ్రామీణ బ్యాంక్ మాలిపోసి శాఖలో జరిగింది. డయానాలి గ్రామానికి చెందిన జీతూ ముండా (50) అనే వ్యక్తిగా సదరు పెద్దాయనను పోలీసులు గుర్తించారు. అతను 2026 జనవరి 26న మరణించిన తన అక్క కల్రా ముండా (56) బ్యాంకు ఖాతా నుంచి రూ. 20,000 విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించాడు. ఆ డబ్బుకు ఏకైక హక్కుదారు జీతూ ముండానే కాబట్టి, ఆమె ఖాతాలోని డబ్బు అతనికి అందేలా చూడాలని స్థానిక అధికారులు బ్యాంకును ఆదేశించారు.
తాను చాలాసార్లు బ్యాంకుకు వెళ్లానని, అక్కడివాళ్లు ఆమె పేరు మీద జమ అయిన డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఖాతాదారురాలిని తీసుకురమ్మని చెప్పారని జీతూ వాపోయాడు. ఆమె చనిపోయిందని తాను చెప్పినా, వాళ్లు తన మాట వినకుండా ఆమెను బ్యాంకుకు తీసుకురమ్మని పట్టుబట్టారని తెలిపాడు. దాంతో.. విసుగు చెంది, ఆమె మరణానికి సాక్ష్యంగా తాను సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని బయటకు తీశానని, బ్యాంకుకు తీసుకెళ్లానని నిరక్షరాస్యుడైన జీతూ ముండా మీడియాకు వివరించి చెప్పాడు.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. జీతూ నిరక్షరాస్యుడైన గిరిజనుడని, నామినీ అంటే ఎవరో అతనికి తెలియదని.. మరణించిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే విధానాన్ని వివరించి.. అతనికి అర్థమయ్యేలా చెప్పడంలో బ్యాంకు అధికారులు విఫలమయ్యారని పోలీసులు చెప్పారు. కల్రా ముండా ఖాతాకు నామినీగా ఉన్న వ్యక్తి కూడా మరణించాడు. అందువల్ల.. ఆమె పేరు మీద జమ అయిన డబ్బుపై జీతూ ముండా ఒక్కరే హక్కుదారుగా మిగిలారు. నిబంధనల ప్రకారం.. ఏకైక హక్కుదారుడైన జీతూ ముండాకు వీలైనంత త్వరగా డబ్బు అందేలా ఏర్పాట్లు చేయాలని స్థానిక యంత్రాంగం బ్యాంకు అధికారులను ఆదేశించింది.