Reading Time: 2 minutes

Delhi Capitals: ఆర్సీబీ బౌలర్ల దండయాత్ర.. 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

Caption of Image.

Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు విధ్వంసం సృష్టించారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటింగ్ ఆర్డర్‌ను ఆర్‌సీబీ పేసర్లు పేకమేడలా కూల్చేశారు. పవర్‌ప్లే ముగియక ముందే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే చుక్కలు కనిపించాయి. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్ మ్యాజిక్‌తో ఓపెనర్ సాహిల్ పరాఖ్‌ను ఖాతా తెరవకముందే క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన జోష్ హేజిల్‌వుడ్ ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. హేజిల్‌వుడ్ వేసిన తొలి బంతికే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (1) కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, ఆ తర్వాతి బంతికే సమీర్ రిజ్వీ ‘గోల్డెన్ డకౌట్’ అయి పెవిలియన్ చేరాడు.

ఢిల్లీ బ్యాటర్లు క్రీజులోకి రావడం, వెళ్లడం అన్నట్లుగా సాగింది. ట్రిస్టన్ స్టబ్స్ (5) ఒక ఫోర్ కొట్టి ఆశలు రేపినా, భువనేశ్వర్ బౌలింగ్‌లో దేవదత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా భువీ వేసిన ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయి నిరాశపరిచాడు. ఇక నితీష్ రాణా (1) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ కావడంతో ఢిల్లీ కేవలం 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి అత్యంత దారుణ స్థితికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేరుకుంది.

ఆర్సీబీ బౌలర్ల రికార్డు: 
పవర్‌ప్లేలో ఆర్‌సీబీ బౌలర్లు నిప్పులు చెరిగారు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో 3 వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్ వెన్ను విరిచారు. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్ ఉన్నారు. ఈ ఇద్దరైనా జట్టును గౌరవప్రదమైన స్కోరు వైపు నడిపిస్తారో లేదో చూడాలి. మొత్తానికి ఆర్‌సీబీ బౌలర్ల ‘ఫియర్‌లెస్’ బౌలింగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 

©️ VIL Media Pvt Ltd.