Reading Time: 2 minutes

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ హైకోర్టు తీర్పుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Caption of Image.

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‏పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు, కమిషన్ నివేదికను హైకోర్టు తప్పు పట్టలేదని.. కేవలం సాంకేతిక లోపాలు మాత్రమే ఉన్నాయని చెప్పిందన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. సీబీఐ విచారణపై హైకోర్టులో బీఆర్ఎస్‎కు ఉపశమనం దక్కలేదని చెప్పారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ తర్వాతే నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ విజయంటున్న బీఆర్ఎస్‎కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కానీ అందుకు హైకోర్టు నిరాకరించింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని స్పష్టంగా చెప్పింది. కమిషన్ ఏర్పాటు ఏకపక్షం కాదంది. 

అలాగే, జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను రద్దు చేయాలని బీఆర్ఎస్ కోరగా.. ఇందుకు కూడా హైకోర్టు అంగీకరించలేదు. జ్యుడీషియల్ కమిషన్ నివేదికలో పేర్కొన్న కొందరు బాధ్యులపై చర్యల విషయంలోనే కోర్టు కొన్ని అభ్యంతరాలు తెలిపింది. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీసులు ఇవ్వలేదనే టెక్నికల్ అంశాన్నే కోర్టు తప్పుపట్టింది. ఆ కారణంతోనే కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఇది బీఆర్ఎస్ విజయమా..?’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

ఏ సమాచారం ఇవ్వడానికైనా రెడీ

కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని.. రాష్ట్రం తరుఫున ఏ సమాచారం ఇవ్వడానికైనా రెడీ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకు తలొగ్గి సీబీఐ విచారణ అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చరించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో  కలిసి ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్ ను కలిసి అన్ని అంశాలు వివరించి విచారణ జరపాలని కోరుతామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ప్రాథమిక నివేదిక సీబీఐకి అందజేశామన్నారు. సీబీఐ ఏ సమాచారం అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.