Reading Time: 2 minutes

డీజిల్, పెట్రోల్ కోసం ఏపీలో హాహాకారాలు.. సగానికి పైగా పెట్రోల్ బంకులు క్లోజ్

Caption of Image.
  • రాష్ట్రంలో మునుపెన్నడూ లేని పరిస్థితి
  • డబ్బాలతో రాత్రిళ్లూ నిరీక్షిస్తున్న రైతులు

ఏ బంకుకు వెళ్లినా భారీ క్యూ లైన్లు.. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు.. అర్ధరాత్రి వరకు ఆయిల్ కోసం పడిగాపులు.. ఇది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. వార్ ఎఫెక్ట్ యుద్ధం జరుగుతుంటే తెలియలేదు కానీ.. అక్కడ ముగిసిన ఇక్కడ మొదలైంది ఆందోళన.  డీజిల్, పెట్రోలు కొరతతో వాహనదారులు గగ్గోలు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. 

ఆయిల్ కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,500 పైగా బంకుల్లో సగానికి పైగా మూతపడ్డాయి. చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, భారీగా బారులు తీరిన వాహనాలే కన్పిస్తున్నాయి. దూర ప్రాంతాలకు బయల్దేరిన ఎందరో.. దారిలో ఇంధనం అయిపోయి తిరిగి పోయించుకునే వీల్లేక పిల్లలు, వృద్ధులతో రహదారులపై చిక్కుకుపోయారు. మూడు రోజుల కిందటే సమస్య ఉత్పన్నం కాగా, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకోకపోవడంతో ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. 

వరికోత యంత్రాలకు, ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు తిప్పేందుకు డీజిల్ కోసం రైతులు రాత్రిళ్లు సైతం పడిగాపులు పడుతున్నారు. పొలం నుంచి పంట తెచ్చుకోవాలన్నా, మార్కెట్లకు తరలించాలన్నా.. రైతులకు వాహనాలు దొరకడం లేదు. ట్రావెల్ బస్సులు, రవాణా వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించుకుని వస్తున్నాయి.

  • ఒక్కో జిల్లాలో వందల కొద్దీ బంకుల మూత..

రాష్ట్రవ్యాప్తంగా 4,510 బంకులు ఉంటే.. వాటిలో 421 మూత పడినట్లు ఇంధన సంస్థలు, పౌరసరఫరాల శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. వాస్తవానికి ఒక్కో జిల్లాలో మూడో వంతు బంకుల్లో డీజిల్ నిల్వలు అడుగంటగా, 10-20 బంకుల్లో పెట్రోలు కొరత కూడా నెలకొంది. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో 70, పల్నాడు జిల్లాలో 61, బాపట్ల జిల్లాలో 15 బంకుల్లో డీజిల్ లేదని అక్కడి అధికారులే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువే ఉంటాయి. అనకాపల్లి జిల్లా పరిధిలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న 80% బంకుల్లో డీజిల్ లేదు. ఉమ్మడి కడప జిల్లాలోనూ సమస్య ఉంది. తిరుపతిలో 30% బంకులు మూతపడ్డాయి. తిరుమలలోనూ డీజిల్ లేదు. విశాఖలో కొన్నిచోట్ల పెట్రోలు కొరత ఏర్పడింది.

  • దెబ్బతిన్న సరఫరా వ్యవస్థ..

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఇంధన సంస్థలకు నష్టాలు పెరిగాయి. దీంతో అమ్మకాలు కుదించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని పెట్రోలియం సంస్థల ఆధ్వర్యంలోని ఔట్లెట్ల ద్వారా అధికశాతం అమ్మకాలు జరుగుతాయి. వీటిలో ఓ సంస్థ గత నెలలో అధికంగానే సరఫరా చేసినా.. ఏప్రిల్ రెండో వారం నుంచి తగ్గించింది. దీంతో మరో రెండు సంస్థలకు చెందిన ఔట్లెట్లపై ఆ ప్రభావం పడింది. సరఫరా వ్యవస్థ దెబ్బతింది. కొన్ని ఔట్లెట్లలో బల్క్ వినియోగదారులకు మళ్లిస్తుండటమూ సమస్యకు కారణం అయ్యింది. 

ఆదివారం (ఏప్రిల్ 26) కొన్నిచోట్ల అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు నిల్వలున్నా.. పంపిణీ చేయడం లేదనే విషయం వెల్లడైంది. సాధారణంగా రోజుకు పెట్రోల్ 6,330 కిలోలీటర్లు, డీజిల్ 9,048 కిలోలీటర్ల అమ్మకాలు జరుగుతాయి. కానీ, శనివారం (ఏప్రిల్ 25) 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేశామని పెట్రోలియం సంస్థలు నివేదికలిచ్చాయి. అప్పటికీ సమస్య తీరకపోగా, మరింత పెరగడానికి ఇంధన మళ్లింపు కారణమని పేర్కొంటున్నారు. పారిశ్రామిక వినియోగానికి సరఫరా చేసే డీజిల్ ధర లీటరు రూ.152 అయింది. దీంతో ఆయా సంస్థలు కూడా ఔట్లెట్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి.

  • ఇండెంట్కు అనుగుణంగా సరఫరా లేదు.. 

ఇండెంట్ కు  అనుగుణంగా సరఫరా చేయకపోవడం వల్లే సమస్య ఎదురవుతోందని బంకుల డీలర్లు పేర్కొంటున్నారు. గతేడాది అమ్మకాలతో పోలిస్తే పెట్రోలు 15%, డీజిల్ 25% అధికంగా సరఫరా చేశామని ఇంధన సంస్థలు చెబుతున్నా.. అంత చేయలేదని డీలర్లు చెబుతున్నారు. కొరత నేపథ్యంలో ఫుల్ ట్యాంక్ చేయించేందుకు వాహనదారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో డీలర్లు డీజిల్, పెట్రోల్ పంపిణీకి పరిమితులు పెట్టారు. 

  • ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ప్రమాదం..

పెట్రోల కొరత భయంతో ఆయిల్ ట్యాంక్ నిండా ఇంధనాన్ని నింపుతున్నారు వాహనదారులు. ప్రస్తుతం మండుతున్న ఎండల దృష్ట్యా ఫుల్ ట్యాంక్ కొట్టించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్యాంకు నిండుగా ఉన్నప్పుడు ఎండ వేడిమికి ఇంధనం వ్యాకోచిస్తుంది. లోపల ఖాళీ లేకపోతే.. ఒత్తిడి పెరిగి ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ట్యాంక్ చిన్నపాటి లీకేజీ ఉన్నా.. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. 

వాహన తయారీ సంస్థలు పెట్రోల్ ట్యాంకులను డిజైన్ చేసేటప్పుడు, ఇంధనం వ్యాకోచించడానికి కొంత ఖాళీ వదిలి పెడతాయి. ట్యాంక్ సామర్థ్యం కంటే ఎక్కువగా, ఆటో-కట్ అయిన తరువాత కూడా నింపడం వల్ల లోపలి ఎయిర్ లాక్ వ్యవస్థ దెబ్బతింటుంది. ట్యాంకు ఫుల్ గా ఉన్నప్పుడు కలిగే అధిక ఒత్తిడి కారణంగా కార్బ్యురేటర్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్పై ప్రభావం చూపి, వాహనం ఆగిపోవడానికి, స్టార్టింగ్ సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.