Reading Time: < 1 minute

సమస్యలు పరిష్కరించకుంటే సింగరేణి సమ్మె..ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్

Caption of Image.

కోల్‌బెల్ట్, వెలుగు: కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సింగరేణిలో సమ్మెకు దిగుతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సీఈఆర్ క్లబ్‌లో నిర్వహించిన ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. ఈ కోడ్‌ల ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తూ 12 గంటల పనివిధానాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశంలో కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా ఈసారి సింగరేణి కార్మికులు మేడేను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

సింగరేణిలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.  ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఎం.డి.అక్బర్ అలీ, మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచ్‌ల కార్యదర్శులు సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, ఉపాధ్యక్షుడు భీమనాధుని సుదర్శనం పాల్గొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.