Reading Time: 2 minutes

ఎన్హెచ్ 353 సీ ఇక ఫోర్లేన్.. గుడెప్పాడ్ నుంచి చెల్పూర్ వరకు 42 కిలోమీటర్ల మేర విస్తరణ

Caption of Image.
  • రూ.662 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
  • టెండర్ల ప్రక్రియ పూర్తి
  • భూసేకరణ పనులు స్పీడప్ చేసిన ఆఫీసర్లు 

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ఎన్​హెచ్​353 సీ జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో నాలుగులేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ నుంచి భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్​ వరకు 42 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా విస్తరణకు రూ.662కోట్లు కేటాయించగా, ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఆఫీసర్లు రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ పనుల్లో వేగం పెంచారు. రోడ్డు డిజైన్​పూర్తి కాగానే పనులు ప్రారంభం కానున్నాయి. జెన్​కో, కాళేశ్వరం, భూపాలపల్లి గనుల నుంచి బొగ్గు, ఇసుక తరలించే లారీలు, ఇతర యంత్రాలను తరలించే వాహనాలు, బూడిద వాహనాలతో రద్దీగా ఉండే ఈరోడ్డు విస్తరణతో ప్రమాదాలు నియంత్రణతోపాటు ప్రయాణం సులభతరం కానున్నది.  

భూసేకరణ వేగంగా..

353 సీ జాతీయ రహదారి నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆఫీసర్లు భూసేకరణ పనులు స్పీడ్ అప్ చేశారు. రోడ్డు విస్తరణకు 3.39 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, 1.55 హెక్టార్ల భూమి త్రీడీ స్టేజ్ లో ఉండగా, మొత్తంగా 60 శాతం వరకు భూసేకరణ పూర్తి చేశారు. మిగతా 40 శాతం సేకరణ పూర్తి చేసి డిజైన్​ అనంతరం పనులు ప్రారంభించేలా ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు. ఇటీవలే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్  అనుమతులు రాగానే పనులు షురూ చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు.

చలివాగు, మోరంచ వాగులపై భారీ వంతెనలతో పాటు 13 మైనర్ బ్రిడ్జిలు, 68 పైపు, 54 బాక్స్ కల్వర్టులు నిర్మాణం చేపట్టనున్నారు. శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం సమీపంలో టోల్ గేట్ ఏర్పాటు చేయనున్నారు. టోల్ గేట్ నిర్మాణానికి 8 ఎకరాల భూమి అవసరం ఉన్నట్లుగా గుర్తించి మార్కింగ్ చేశారు. అయితే, రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. 

వేలాది వాహనాలతో రద్దీ..

భూపాలపల్లి 353 సీ జాతీయ రహదారి నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి వెళ్లే భక్తులతో పాటు, కాళేశ్వరం వద్ద గోదావరిపై అంతరాష్ట్ర వంతెన నిర్మాణంతో మహారాష్ట్ర, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు, టూరిస్టులతో వాహనాల తాకిడి పెరిగింది. ఇసుక, బొగ్గు లారీలు, బూడిద బల్కర్లు, కేటీపీపీ, తాడిచర్ల ఓసీలకు అవసరమైన భారీ యంత్రాలను తరలించే వాహనాలు ఈ రోడ్డుపైనే వెళ్తాయి.

భారీ వాహనాలు, వర్షాలతో ప్రస్తుతం ఉన్న రహదారి గుంతలమయంగా మారింది. మేడారం జాతర ముందు ప్యాచ్ వర్క్ చేసినప్పటికీ రోడ్డుపై ఏర్పడిన గుంతలతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి విస్తరణతో ప్రమాదాలు నివారణతో పాటు ప్రయాణం సులభతరం ఉంటుందని వాహనదారులు పేర్కొంటున్నారు. 

60శాతం భూసేకరణ చేశాం.. 

నాలుగు లైన్ల రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ 60 శాతం వరకు పూర్తయ్యింది. మిగతా 40 సేకరణ పూర్తి చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యింది. త్వరగా పనులు ప్రారంభించనున్నాం. ల్యాండ్ అక్వివేషన్​ కోసం రెవెన్యూ ఆఫీసర్ల సమన్వయంతో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రమోద్ కుమార్, ఎన్ హెచ్​ డీఈ

©️ VIL Media Pvt Ltd.