Reading Time: 2 minutes

బీసీ మహిళలకు గుడ్ న్యూస్: ఉచితంగా కుట్టు మెషీన్లు పంపిణి

Caption of Image.
  • నియోజకవర్గానికి 1,0‌‌‌‌‌‌‌‌00 చొప్పున ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం
  •  వారంలో గైడ్​లైన్స్.. త్వరలో అప్లికేషన్ల స్వీకరణ 
  • లబ్ధిదారులను ఎంపిక చేయనున్న కలెక్టర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వయం ఉపాధి కల్పించేందుకు ఆటోమేటిక్ కుట్టు మెషీన్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి ఆదివారం జీవో జారీ చేశారు. అంతకుముందు కమిషనర్ తోపాటు బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, ఇతర అధికారులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ చేశారు. గతంలో ఎప్పుడూ మహిళలకు సర్కారు ఈ విధంగా కుట్టు మెషీన్లు ఇవ్వలేదని అధికారులు అంటున్నారు. 

రూ.142 కోట్లు అవసరమని అంచనా​

తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గానికి 1,000 కుట్టు మెషీన్లు ఇవ్వనున్నామని, త్వరలో అప్లికేషన్లు స్వీకరిస్తామని కమిషనర్​తెలిపారు. మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేసి, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఒక కుట్టు మెషిన్​ధర రూ.12 వేలు ఉందని, ఈ స్కీమ్ అమలుకు రూ.142 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ వారంలో స్కీం గైడ్ లైన్స్ ను రిలీజ్ అవుతాయని చెప్తున్నారు. 

ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి

బీసీ మహిళలు ఓబీఎంఎస్(ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్ మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా ఆన్​లైన్​లో ఈ స్కీంకు అప్లై చేసుకోవాలి. మండలాల వారీగా వచ్చిన అప్లికేషన్లను అధికారులు పరిశీలించి, అర్హులను ఎంపిక చేసి కలెక్టర్లకు పంపిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ చార్జి మంత్రుల ఆమోదంతో ఉచితంగా కుట్టు మెషీన్లు అందిస్తారు.

పైరవీల్లేకుండా అర్హుల ఎంపిక: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. బీసీ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి 100 శాతం  సబ్సిడీతో కుట్టు మెషీన్లు ఇవ్వాలని నిర్ణయించాం. పైరవీల్లేకుండా అర్హులను ఎంపిక చేస్తాం. త్వరలో గైడ్ లైన్స్ రిలీజ్ చేసి, అప్లికేషన్లు తీసుకుంటాం. బీసీ మహిళలు సొంతంగా వ్యాపారాలు స్థాపించి ఆర్థికంగా ఎదగాలని, వారు మరి కొంతమందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. 

©️ VIL Media Pvt Ltd.