Reading Time: 2 minutes

ప్రతిశాఖకు కులాల లెక్కలు.. సీపెక్ సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు

Caption of Image.
  • జనాభా, వెనుకబాటు ఆధారంగా 
  • ఏం చేయాలో సూచించాలని అన్ని శాఖలకు సర్కారు ఆదేశాలు 
  • ఎవరి పరిస్థితి ఏమిటి ? 
  • ఏం చేయాలనే విధంగా రిపోర్టులు
  • రెండు నెలల్లోగా నివేదించాలని ఆర్డర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సామాజిక ముఖచిత్రాన్ని సమూలంగా ఆవిష్కరించిన ‘సీపెక్’ (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే) సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కులం వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా లెక్కగట్టిన ఈ నివేదికను అన్ని ప్రభుత్వ శాఖలకు పంపిస్తూ, జనాభా దామాషా, వెనుకబాటుతనం ప్రాతిపదికన చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్ర సిఫార్సులు అందజేయాలని ఆదేశించింది. 

సామాజిక అసమానతలను రూపుమాపి, ఓట్ల రాజకీయాలకతీతంగా, నిజంగా అవసరమున్న వర్గాలకు ‘లక్షిత సంక్షేమం’అందించడమే లక్ష్యంగా ఈ కసరత్తు మొదలైంది. రెండు నెలల గడువులోగా ఆయా శాఖలు ఇచ్చే ఫీడ్‌‌‌‌బ్యాక్ ఆధారంగా నిధుల ఖర్చు, కొత్త పథకాల రూపకల్పనలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం 2.0 పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

  • వెనుకబాటుతనం ప్రాతిపదికన వాటా 

 ప్రతి కులానికి, ప్రతి ఉప కులానికి వారి వెనుకబాటుతనం ఎంత ఉంది? వారు ఏయే రంగాల్లో వెనుకబడి ఉన్నారు? అనే అంశాల ఆధారంగానే సంక్షేమ పథకాలను డిజైన్ చేయబోతున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న అనేక పథకాల్లో అర్హత లేని వారు లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉండగా, ఈ కొత్త డేటా ఆధారంగా ‘సోషల్ జస్టిస్ ట్యాప్’ ద్వారా ప్రతి పేద గడపకూ లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

గత 7 దశాబ్దాలుగా కేవలం జనాభా ప్రాతిపదికన సాగుతున్న రిజర్వేషన్ల చర్చను, ఇప్పుడు ‘వెనుకబాటుతనం ప్రాతిపదికన వాటా’అనే కొత్త కోణంలోకి తీసుకువస్తున్నారు. రాష్ట్రంలోని 3.55 కోట్ల మంది ప్రజల జీవన స్థితిగతులను విశ్లేషించిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, సుమారు 1.1 కోట్ల మంది ప్రజలు, అంటే మొత్తం జనాభాలో 31 శాతం మంది, తమ వార్షిక ఆదాయం లక్ష రూపాయల కంటే తక్కువ అని స్వయంగా వెల్లడించడం గమనార్హం. 

ఈ నేపథ్యంలోనే ప్రతి ప్రభుత్వ శాఖ తన పరిధిలోని జనాభా వెనుకబాటుతనం ఆధారంగా ఏయే పథకాలను ఏ విధంగా సంస్కరించాలో, కొత్తగా ఏ చర్యలు తీసుకోవాలో నివేదించాలని ప్రభుత్వం కోరింది. కేవలం మొక్కుబడి పథకాలు కాకుండా, గుడ్డిగా నిధులు వెచ్చించడం కంటే, ‘టార్గెటెడ్ పాపులేషన్ బేస్’మీద అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించడం ద్వారా సంక్షేమ ఫలాలు అట్టడుగున ఉన్న వారికి నేరుగా చేరేలా చూడాలని భావిస్తున్నది. 

  •  అభివృద్ధి చెందిన వర్గాలకే సంక్షేమం!

రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో 30 శాతం నిధులు రాష్ట్ర సగటు కంటే తక్కువ వెనుకబడిన కులాలకు చేరుతున్నాయని సర్వేలో వెల్లడైంది. ఉదాహరణకు రైతు భరోసా, ఉచిత విద్యుత్‌‌‌‌లాంటి వ్యవసాయ పథకాల లబ్ధిదారుల్లో 15% మంది అభివృద్ధి చెందిన వర్గాల వారే ఉండగా, అత్యధిక జనాభా ఉండి అత్యంత వెనుకబడిన ఎస్సీలు కేవలం 12% మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. 

‘సోషల్ జస్టిస్ ట్యాప్’ ద్వారా ప్రతి పైసా అత్యంత అవసరమున్న పేద గడపకే చేరేలా పథకాల నిబంధనలను మార్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు పౌర సరఫరాలు, వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖలు తమ లబ్ధిదారుల జాబితాను సీపెక్ డేటాతో సరిపోల్చుకుని సవరణలు చేయాల్సి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు తెగ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. వీరి జనాభా 35,583 గా ఉండగా, వీరి కాంపోజిట్ వెనుకబాటుతనం ఇండెక్స్ ఏకంగా 108 పాయింట్లుగా నమోదైంది. 

అత్యున్నత స్థాయి వెనుకబాటుతనాన్ని సూచించే ఈ గణాంకాలు, ఇప్పటికీ ఆయా గిరిజన గూడేలకు విద్యుత్ సౌకర్యం గానీ, సురక్షితమైన తాగునీరు గానీ అందడం లేదని చెబుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో దాదాపు 25 శాతం మందికి కనీస మౌలిక వసతులు కూడా నోచుకోలేదని సర్వేలో తేలడం పాలకుల ముందు పెద్ద సవాలుగా నిలిచింది. ఈ నేపథ్యంలో, చెంచులను అడవుల్లోనే ఉంచి అభివృద్ధి చేయాలా? లేక వారిని మైదాన ప్రాంతాలకు తరలించి జనజీవన స్రవంతిలో కలిపి అభివృద్ధి బాట పట్టించాలా? అనే దానిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన పాలసీని 
రూపొందించాల్సి ఉంది. 

  • విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక ఊతం 

రాష్ట్రవ్యాప్తంగా 242 కులాలను సర్వే చేయగా, అందులో 135 కులాలు రాష్ట్ర సగటు వెనుకబాటు తనం (సీబీఐ స్కోర్ 81) కంటే దారుణమైన స్థితిలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఈ 135 కులాలు రాష్ట్ర జనాభాలో 67 శాతంగా ఉన్నాయి. ఇందులో 99% ఎస్టీలు, 97% ఎస్సీలు, 71% బీసీలు అత్యంత వెనుకబడి ఉన్నారని తేలింది. విద్యాపరంగా చూస్తే.. జనరల్ క్యాస్ట్ పిల్లలు 34% మంది ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తుంటే, ఎస్టీలు 13%, ఎస్సీలు 15% మాత్రమే వెళ్లగలుగుతున్నారు. అలాగే, ఇంగ్లిష్ మీడియం విద్యలోనూ భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి ఏయే కులాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక ఊతం ఇవ్వాలో విద్యాశాఖ, ఉపాధి కల్పన శాఖలు నివేదికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.