
భారతదేశంలో హిందువులు కొన్ని రకాల మొక్కలను పవిత్రమైన మొక్కలుగా భావించడంతోపాటు వాటికీ పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో వేప, తులసి,అరటి, జిల్లేడు వంటి మొక్కలకు పూజలు చేస్తూ ఉంటారు. చాలామంది రావి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణలు చేస్తారు. కాని పురాణాల్లో రావి చెట్టుకు పూజ చేసే విధానం.. ఎలా ప్రదక్షిణలు చేయాలి అనే విషయాల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . !
హిందువులు పవిత్రంగా భావించి పూజించే మొక్కలలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టుని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. అలా రావి చెట్టుకు పూజలు చేయడం .. ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు. రావి చెట్టుకు పూజ చేయాలి అనుకున్న వారు సూర్యోదయం తర్వాత నది స్నానం ఆచరించి.. కుంకుమను చెట్టు మొదట్లో సమర్పించి రావి చెట్టును పూజించాలి.
ఎలా పూజ చేయాలంటే..!
రావి చెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకోవాలి. అలాగే ఏడుసార్లు చెట్టు మొదట్లో రాగి లేదా ఇత్తడి చెంబుతో నీళ్లు పోసి అభిషేకం చేయాలి. తరువాత విష్ణు సహస్రనామాలను చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అయితే ఎట్టి పరిస్థితిలో రావి చెట్టును తాకకూడదు. ప్రతి ప్రదక్షిణం అనంతరం నమస్కరించాలి. అయితే ఒక్క శనివారం రోజు మాత్రం రావి చెట్టును తాకి పూజ చేసి అనంతరం మనసులో ఉన్న కోరికలను కోరుకోవడం వల్ల తప్పకుండా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం ఎవరైతే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానమాచరించి రావి చెట్టుకి నీరు పోసి పూజిస్తే అటువంటి వారిపై శని ప్రభావం ఉండదు. ప్రతిరోజు రావి చెట్టుకి పూజించే సమయంలో రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల మరింత మంచి జరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజ చేయడం వల్ల కోరిన కోరికల్ని నెరవేరడంతో పాటు ఆ శనీశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది…!