
- క్షేత్రస్థాయికి యువ ఆఫీసర్లు.. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
- పంచాయతీ రాజ్ శాఖకు దాన కిశోర్
- ఢిల్లీలో తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్‌గా సంజయ్ కుమార్
- కార్మిక శాఖ కార్యదర్శిగా దాసరి హరిచందన
- హైదరాబాద్ కలెక్టర్‌గా ప్రియాంక అల.. ఇంటర్ బోర్డుకు అభిలాష అభినవ్
- ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా ముకుంద్ రెడ్డి
- రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీగా ప్రావీణ్యకు పోస్టింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. పలువురు అధికారులను బదిలీ చేయగా.. మరికొందరికి కొత్తగా పోస్టింగులు ఇచ్చారు. మూడు వేర్వేరు జీవోల ద్వారా మొత్తం 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ కె. రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా సీనియర్ అధికారి సంజయ్ కుమార్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్‌గా పంపగా, ఆయన స్థానంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలను ఎం. దాన కిశోర్ చేపట్టనున్నారు. హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న హరిచందన దాసరిని కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూనే, రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) బాధ్యతలను ఎఫ్ఏసీగా అప్పగించారు. జి. ముకుందరెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయనను సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్‌గా, ఈఓ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. నిర్మల్ కలెక్టర్‌గా ఉన్న అభిలాష అభినవ్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు సెక్రటరీగా, సంగారెడ్డి కలెక్టర్ పి. ప్రావీణ్యను రోడ్లు భవనాల శాఖకు స్పెషల్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది.
పలు జిల్లాలకు కొత్త సారథులు
జిల్లా కలెక్టర్ల స్థాయిలో భారీ మార్పులు జరిగాయి. హైదరాబాద్ కలెక్టర్‌గా ప్రియాంక అల, సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రతీక్ జైన్, ఖమ్మం కలెక్టర్‌గా దివాకర టి.ఎస్., ములుగు కలెక్టర్‌గా భోర్కడే హేమంత్ సహదేవరావును నియమించారు. నిర్మల్ కలెక్టర్‌గా భవేష్ మిశ్రా, నారాయణపేట కలెక్టర్‌గా చెక్కా ప్రియాంక, నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా హేమంత కేశవ్ పాటిల్ నియమితులయ్యారు. ఖమ్మం కలెక్టర్‌గా పనిచేసిన అనుదీప్ దురిశెట్టిని ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించి, గనులు, టీజీఎండీసీ బాధ్యతలను అప్పగించారు. ఆరోగ్యశ్రీ సీఈవోగా జెండగే హన్మంత్ కొండిబా, సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీగా బి. విజయేందిర బాధ్యతలు స్వీకరిస్తారు. పరిశ్రమల శాఖకు ఎస్. కృష్ణ ఆదిత్య, గిరిజన సంక్షేమ శాఖకు సంతోష్ బి.ఎం.లను స్పెషల్ సెక్రటరీలుగా నియమించారు.
జోనల్ కమిషనర్లుగా
జీహెచ్ఎంసీలో కీలకమైన జోనల్ కమిషనర్ల పోస్టులను ప్రభుత్వం మార్చింది. పి. ఉదయ్ కుమార్ (గోల్కొండ), బాదావత్ సంతోష్ (ఖైరతాబాద్), నారాయణ అమిత్ మలేంపాటి (శేరిలింగంపల్లి), వికాస్ మహతో (ఎల్.బి. నగర్), మయాంక్ సింగ్ (కూకట్‌పల్లి), ఎస్. శ్రీనివాస్ రెడ్డి (రాజేంద్రనగర్) కొత్త జోనల్ కమిషనర్లుగా నియమితులయ్యారు.
ఉట్నూరు ఐటీడీఏ పీవోగా మంద మకరందు
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఐటీడీఏలకు కొత్త అధికారులను నియమించింది. ఉట్నూరు పీవోగా మంద మకరందు, ఏటూరు నాగారం పీవోగా లెనిన్ వత్సల్ టొప్పోలను నియమించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా కిరణ్మయి కొప్పిశెట్టిని, కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా యువరాజ్ మర్మత్‌ను పంపారు. సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా అపూర్వ్ చౌహాన్‌కు బాధ్యతలు అప్పగించారు.