Reading Time: < 1 minute

మౌలాలీలో భారీ డ్రగ్స్ డెన్ గుట్టురట్టు

Caption of Image.
  • 17.4 కోట్ల విలువైన అల్ర్పాజోలం, ఎఫెడ్రిన్ పట్టివేత
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎన్‌‌‌‌సీబీ

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌ మౌలాలీ ఇండస్ట్రియల్‌‌‌‌ ఏరియాలో భారీ డ్రగ్స్‌‌‌‌ డెన్‌‌‌‌ గుట్టురట్టు అయ్యింది. మౌలాలీలోని ఐడీఏ ఇండిస్ట్రియల్‌‌‌‌ కేంద్రంగా అల్ర్పాజోలం, ఎఫెడ్రిన్‌‌‌‌లను తయారు చేస్తున్న కెమికల్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌పై సోమవారం నార్కొటిక్స్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బ్యూరో(ఎన్‌‌‌‌సీబీ) అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో 69.600 కిలోల అల్ర్పాజోలం, ఎఫెడ్రిన్ తయారీకి సేకరించిన ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కెమిస్ట్‌‌‌‌ సహా ముగ్గురిని అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు. సీజ్‌‌‌‌ చేసిన అల్ర్పాజోలం, ఎఫెడ్రిన్ విలువ రూ.17.40 కోట్లుగా అంచనా వేశారు. మరో రూ.20 లక్షలు విలువ చేసే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు బుధవారం ఒక పత్రిక ప్రకటనను  విడుదల చేశారు.

రెండు డ్రమ్ముల్లో అల్ర్పాజోలం 

మౌలాలీ ఇండస్ట్రియల్‌‌‌‌ ఏరియాలో అల్ర్పాజోలం, ఎఫెడ్రిన్ అక్రమంగా తయారు చేస్తున్నారనే సమచారంతో ఓ కెమికల్ యూనిట్‌‌‌‌లో సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. సోదాల సమయంలో  కెమిస్ట్, ముడి పదార్థాలను సేకరించిన వ్యక్తి, సరుకును కొనుగోలు చేసే మరో వ్యక్తి సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ల్యాబ్‌‌‌‌లో రెండు ప్లాస్టిక్ డ్రమ్ములలో నిల్వ ఉంచిన అల్ర్పాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి లైసెన్సు లేకుండా ఎఫెడ్రిన్ డ్రగ్‌‌‌‌ తయారు చేయడానికి అవసరమైన రసాయనాలను, ద్రావకాలను పెద్ద పరిమాణంలో సేకరించినట్టు ఎస్‌‌‌‌సీబీ అధికారులు గుర్తించారు. అప్పటికే తయారు చేసిన అల్ర్పాజోలంతో పాటు, దాని తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, ఎఫెడ్రిన్‌‌‌‌లో వాడే రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఏడాది 78 కిలోల  అల్ర్పాజోలం సీజ్‌‌‌‌

అల్ర్పాజోలంను తెలంగాణలోని కల్లు దుకాణాలకు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది హైదరాబాద్‌‌‌‌లో ఇప్పటి వరకు 9 కేసులు నమోదు చేసి, వివిధ రకాల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అల్ర్పాజోలం 78 కేజీలు, గంజాయి – 1208 కేజీలు, చరస్ – 2 కేజీలు, క్లోబజామ్ – 26 గ్రాములు స్వాధీనం చేసుకుని.. మొత్తం 24 మందిని అరెస్టు చేసినట్లు ఎన్‌‌‌‌సీబీ అధికారులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.