Reading Time: 2 minutes

సీతారామ పనులను స్పీడప్‌‌‌‌ చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Caption of Image.
  • సత్తుపల్లి ట్రంక్‌‌‌‌ కాల్వ ద్వారా వర్షాకాలం నాటికే గోదావరి జలాలు అందించాలి
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సత్తుపల్లి/అన్నపురెడ్డిపల్లి, వెలుగు : సీతారామ లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లో భాగమైన సత్తుపల్లి ట్రంక్‌‌‌‌ కాల్వ పనులను స్పీడప్‌‌‌‌ చేసి వర్షాకాలం నాటికి గోదావరి జలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌‌‌‌ అంకిత్, ఖమ్మం కలెక్టర్‌‌‌‌ అనుదీప్ దురిశెట్టిలతో కలిసి బుధవారం సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో రివ్యూ నిర్వహించారు. అంతకుముందు అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు నుంచి యాతాలకుంట వరకు సాగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్‌‌‌‌ కాలువ పనులను పరిశీలించారు.

నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీలు, రోడ్డు క్రాసింగ్‌‌‌‌లు, కాల్వ పనుల అమలులో ఉన్న లోపాలు, సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన రివ్యూలో మంత్రి మాట్లాడారు. ఇంజనీరింగ్ ఆఫీసర్లు అలసత్వాన్ని వీడి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. సత్తుపల్లి ట్రంక్‌‌‌‌ కాల్వ ద్వారా సుమారు 43 కిలోమీటర్ల పొడవున 1.46 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. 

మొత్తం రూ.700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు సుమారు రూ.600 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని తెలిపారు. యాతాలకుంట టెర్మినల్‌‌‌‌కు సంబంధించి మొత్తం 1.78 కిలోమీటర్ల పనుల్లో చివరి 30 మీటర్ల పనులు మాత్రమే పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని, వీటిని 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలానికి ముందే టన్నెల్ ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రక్చర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు అవసరమైన నిధులు మంజూరు అయ్యాయని, కోర్టు కేసులు, భూ సంబంధిత సమస్యల కారణంగా ఎక్కడైనా పనులు ఆలస్యమైతే వెంటనే కలెక్టర్‌‌‌‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలను తెలియజేయకుండా పనులు నిలిపివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కోర్టు కేసు కారణంగా ఒక కిలోమీటర్ కాల్వ పనులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయన్నారు. యాతాలకుంట టన్నెల్‌‌‌‌ నిర్మాణంపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్‌‌‌‌ వచ్చాక కేవలం రెండేండ్లలోనే టన్నెల్‌‌‌‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం నాగార్జునసాగర్‌‌‌‌ నీరు రాకపోయినా వైరా ఆయకట్టు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాలకు గోదావరి నీటిని మళ్లించే అవకాశం ఉందన్నారు. సత్తుపల్లి ట్రంక్ కాలువ ద్వారా వేంసూరు, దమ్మపేట మండలాలకు కూడా నీరు అందించొచ్చన్నారు. నాలుగో పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ పనులు పూర్తయితే వచ్చే సంవత్సరం నాటికి అశ్వరావుపేట, దమ్మపేట మండలాలకు గోదావరి జలాలు అందించవచ్చన్నారు. 

©️ VIL Media Pvt Ltd.