
ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజా జీవితం స్తంభించిపోయిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. బుధవారం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న నేతృతంలో జేఏసీ నాయకులు విద్యానగర్ బీసీ భవన్ లో కృష్ణయ్యను కలిసి మద్దతు కోరారు.
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీసీ సంఘం మద్దతు ఉంటుందని కృష్ణయ్య చెప్పారు. కార్మికులవి న్యాయమైన డిమాండ్లు అని కొత్తగా ఏమీ కోరడంలేదన్నారు. ఎన్నికల వాగ్దానం ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల అనేక సమస్యలు పరిష్కారమవడంలేదన్నారు. విధి లేని పరిస్థితిలో సమ్మె చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని తెలిపారు.