
- టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్ల కోసం నోటిఫికేషన్
- అయినా సరిపోక ప్రయాణికుల అవస్థలు
- మెట్ర, ఎంఎంటీఎస్ వైపు పరుగులు
- దండుకున్న ఆటోలు, క్యాబ్‌లు
- కిక్కిరిసిన మెట్రో, ఎంఎంటీఎస్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఆర్టీసీ సమ్మెతో గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణాపై ప్రభావం పడింది. సుమారు 90 శాతం బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె మొదలవడం, సమాచారం లేకపోవడంతో తెల్లవారుజామున, ఉదయం బస్టాప్‌లు, బస్టాండ్లకు వెళ్లిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ దాదాపు 630 అద్దె బస్సులు, ఆర్టీసీకి చెందిన 80 బస్సులు, 90 ఎలక్ట్రిక్బస్సులు నడిపినా సరిపోలేదు.
సాధారణ రోజుల్లో అన్నీ కలిపి 3,200 బస్సులు నడిపే అధికారులు బుధవారం 800 మాత్రమే నడపడంతో చాలా బస్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ముఖ్యంగా జిల్లాలకు వెళ్లడానికి జేబీఎస్, ఎంజీబీఎస్టెర్మినళ్లతో బాటు దిల్ సుఖ్‌నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ స్టేషన్లకు వచ్చిన వారు చాలాసేపు ఎదురుచూడాల్సి వచ్చింది. బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో చాలామంది టికెట్ లేకుండానే జర్నీ చేశారు.
సిటీ బస్సులు బయటికి వెళ్లలే
రేతిఫైల్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠి, ఉప్పల్, అబిడ్స్, దిల్సుఖ్నగర్, కేపీహెచ్‌బీ, నల్లకుంట, కూకట్పల్లి, పంజాగుట్ట, బేగంపేట్తదితర బస్టాపుల్లో సిటీ బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూశారు. ఎప్పుడోసారి బస్సు రావడంతో అసహనానికి గురయ్యారు. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు, ఇతర పనులపై వెళ్లే వారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సిటీ బస్సులు లేక చాలామంది ప్రత్యామ్నాయంగా మెట్రో, ఎంఎంటీఎస్సర్వీసులను ఆశ్రయించారు.
దిల్ సుఖ్ నగర్ 2 డిపోలో 115 బస్సులకు 18 బస్సులు మాత్రమే నడిచాయని డీఎం సమత తెలిపారు. హయత్ నగర్ 1డిపోలో 210, హయత్ నగర్ 2డిపోలో 180, బండ్లగూడ డిపోలో 150, జీడిమెట్ల డిపోలో 139 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇబ్రహీంపట్నం డిపోలో 75 బస్సులకు 63 బయటకు రాలేదు. కూకట్పల్లి డిపోలోని 140 బస్సుల్లో ఒక్కటి కూడా బయటకు కదలలేదు. మెహిదీపట్నం డిపోలో 160 బస్సులుంటే కేవలం ఏడు మాత్రమే నడిచాయి. దీంతో రూ. 35 లక్షలు నష్టం జరిగిందని డీఎం కృష్ణమూర్తి తెలిపారు. పలు చోట్ల పోలీసు ఎస్కార్ట్ మధ్య అద్దె బస్సులు నడిపారు.
టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లు
సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల కోసం డిపో మేనేజర్లు నోటిఫికేషన్లు విడుదల చేయగా, భారీ సంఖ్యలో యువతీయువకులు హాజరయ్యారు. ఎస్సెస్సీ పాస్ అయి ఉండి, ఆధార్ కార్డు, హెవీ లైసెన్స్ ఉన్న వారు అర్హులని ప్రకటించడంతో జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు స్థానిక డిపోల్లో ఇంటర్వ్యూలకు వచ్చారు. ఆర్టీఏ నుంచి దాదాపు 200 మంది డ్రైవర్లను ఆర్టీసీకి డిప్యూట్చేశారు. కాంట్రాక్ట్ క్యారియర్లు, కాలేజీ బస్సులను కూడా ఆర్టీసీకి సమకూర్చనున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న డ్రైవర్లు, ఇతర సిబ్బందిని కూడా ఆర్టీసీ సేవలకు ఉపయోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దోచుకున్న ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లు
సమ్మె కారణంగా బస్టాపుల వద్ద గంటల తరబడి బస్సులు రాకపోవడం, వచ్చినా కిక్కిరిసి ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించారు. దీంతో ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేయగా, క్యాబ్ డ్రైవర్లు ఛార్జీలపై అదనపు టిప్పులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక ఛార్జీలను వసూలు చేసే వారిపై చర్యలు తీసుకునే వారు లేకపోవడంతో చాలా మంది తప్పని సరి పరిస్థితుల్లో అడిగినంత ఇచ్చి జర్నీ చేయాల్సి వచ్చింది. సాధారణ రోజుల్లో వసూలు చేసే దానికి రెట్టింపు తీసుకున్నారని ఆరోపించారు.