Reading Time: 2 minutes

గెటవుట్ ఆఫ్ హియర్.. ముంబైలో మంత్రిపై మహిళ ఫైర్

Caption of Image.
  •  
  • మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ర్యాలీతో భారీగా 
  • ట్రాఫిక్ జామ్.. వందలాది మందికి అసౌకర్యం
  • మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వద్దకు వెళ్లి నిలదీసిన మహిళ

ముంబై: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కారణమైన ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర మంత్రి గిరీష్  మహాజన్ మంగళవారం ముంబైలోని వర్లీలో ర్యాలీ కాస్తా రసాభాసాగా మారింది. వేలాది మంది మహిళలతో చేపట్టిన ఈ ర్యాలీ కారణంగా వర్లీలో వందలాదిగా వాహనాలు నిలిచిపోవడంతో ఓ మహిళా ప్రయాణికురాలు మంత్రిపై మండిపడింది. మీడియాతో మాట్లాడుతున్న మంత్రి దగ్గరకు వెళ్లి ‘గెటవుట్ ఆఫ్ హియర్..’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “మీకు చెబితే అర్థం కాదా? మీవల్ల వందలాది మంది ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మంత్రి ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, తన బిడ్డను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నానని.. వందలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆమె నిలదీసింది. మధ్యలో పోలీసులు అడ్డుపడగా, వారిపైనా అసహనం వ్యక్తంచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై బుధవారం మంత్రి గిరీష్ మహాజన్ స్పందిస్తూ.. ప్రజలకు కలిగిన ఇబ్బందికి తాను అక్కడికక్కడే క్షమాపణలు చెప్పానని తెలిపారు. ఆమె కోపం సహేతుకమే అయినప్పటికీ, వాడిన భాష సరిగా లేదని, ఆగ్రహంతో బాటిల్ కూడా విసిరారన్నారు. అయితే, ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించినట్లు తెలిపారు. ముంబై ప్రథమ పౌరురాలిగా తాను క్షమాపణలు చెబుతున్నానని మేయర్ రీతూ తావ్డే అన్నారు. అయితే, మహిళా హక్కుల కోసం జరిగిన ఈ నిరసన వెనక ఉన్న కోపాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని ఆమె ఎక్స్‌‌ వేదికగా కోరారు.

ప్రతిపక్షాల విమర్శలు

వీఐపీ కల్చర్ వల్ల ముంబై ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారని, మంత్రి వైఖరి అహంకారపూరితంగా ఉందని ప్రియాంక చతుర్వేది(శివసేన యూబీటీ) విమర్శించారు. ఆ మహిళ చూపించిన ధైర్యమే అసలైన మహిళా శక్తి అని వర్షా గైక్వాడ్(కాంగ్రెస్) తెలిపారు. ప్రచారం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం ఆపాలని బీజేపీకి సూచించారు.

©️ VIL Media Pvt Ltd.