
- రద్దీతో సంబంధం లేకుండా 56 రైళ్లను ట్రాక్‌పైనే ఉంచిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బుధవారం హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. బస్సులు రోడ్డెక్కకపోవడం, ఆటోలు, క్యాబ్ ల యజమానులు చార్జీలు ఇష్టారాజ్యంగా పెంచేయడంతో సామాన్యులు, ఐటీ ఉద్యోగులు మెట్రో స్టేషన్లకు క్యూ కట్టారు. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపించాయి.
సాధారణంగా రోజుకు 4.50 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైళ్లలో అదనంగా 10 శాతం కంటే ఎక్కువ మంది ప్రయాణించారని అధికారులు చెబుతున్నారు. సమ్మె ఇలాగే కొనసాగితే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
రోజంతా నడిచిన రైళ్లు..
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో అధికారులు గరిష్టంగా 56 రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. మియాపూర్-–ఎల్బీనగర్ కారిడార్ లో ప్రతి 4.20 నిమిషాలు, నాగోల్–-రాయదుర్గం కారిడార్ లో ప్రతి 3.40 నిమిషాల గ్యాప్‌తో రోజంతా రైళ్లను నడిపారు. రద్దీ సమయాలతో సంబంధం లేకుండా 56 రైళ్లను ట్రాక్ పైనే ఉంచారు.
రాత్రి వేళల్లో ప్రయాణికుల కోసం చివరి మెట్రో సర్వీస్ వేళలను రాత్రి 11 గంటల తర్వాత పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. టికెట్ కౌంటర్లు, ప్లాట్ ఫామ్ ల వద్ద తోపులాట జరగకుండా అదనపు సిబ్బందిని నియమించామని, సమ్మె కొనసాగినంత కాలం ఇలాగే రైళ్లను నడుపుతామని చెప్పారు.