Reading Time: < 1 minute

2009 తర్వాత పుట్టినవారికి  సిగరెట్లు బ్యాన్..బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం

Caption of Image.
  • స్కూళ్లు, హాస్పిటళ్ల వద్ద వేపింగ్ చేస్తే కఠిన చర్యలు
  • భవిష్యత్ తరాలను నో స్మోకింగ్ దిశగా మార్చేందుకు అడుగులు

లండన్: బ్రిటన్ ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది. దేశంలో 2009 తర్వాత పుట్టినవారికి లైఫ్ టైమ్ సిగరెట్ల అమ్మకాలను నిషేధిస్తూ ‘టొబాకో అండ్ వేప్స్ బిల్లు’ను తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం..2009 జనవరి 1న లేదా ఆ తర్వాత జన్మించిన వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడం చట్టవిరుద్ధం. అంటే ప్రస్తుతం 17 ఏండ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఇకపై సిగరెట్లు కొనలేరు. బ్రిటన్ పార్లమెంటులోని రెండు సభలు హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ లోనూ బిల్లు ఆమోదం పొందింది. త్వరలో ‘రాయల్ అసెంట్ (రాజముద్ర)’ లభించిన వెంటనే ఇది అధికారిక చట్టంగా మారనుంది. 

ఈ బిల్లు కేవలం సిగరెట్లకే పరిమితం కాకుండా.. వేపింగ్(ఈ-సిగరెట్), నికోటిన్ ఉత్పత్తులపై కూడా కఠిన నియంత్రణలను అమలులోకి తేనుంది. వేపింగ్ ఉత్పత్తుల రుచులు(ఫ్లేవర్స్), ప్యాకేజింగ్, మార్కెటింగ్ తీరును నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. అలాగే.. పిల్లల ఆటస్థలాలు, స్కూళ్లు, ఆసుపత్రుల బయట వేపింగ్‌‌‌‌ను పూర్తిగా నిషేధించారు. అయితే, ధూమపానం మానేయాలనుకునే వారికి సహాయపడేలా ఆసుపత్రుల సమీపంలోని కొన్ని బహిరంగ ప్రదేశాల్లో వేపింగ్‌‌‌‌కు మినహాయింపు ఇచ్చారు.

పబ్ గార్డెన్లు, బీచ్‌‌‌‌లు, ప్రైవేట్ నివాసాల్లో ధూమపానానికి ప్రస్తుతం అనుమతి కొనసాగుతుంది.ఈ బిల్లుపై బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్ స్పందిస్తూ..” నివారణ అనేది చికిత్స కంటే ఉత్తమం. ఈ నిర్ణయం ప్రాణాలను కాపాడటమే కాకుండా జాతీయ ఆరోగ్య సేవ (ఎన్ హెచ్ఎస్)పై భారాన్ని తగ్గిస్తుంది” అని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి బారోనెస్ మెర్రాన్ మాట్లాడుతూ.. ఈ తరంలోనే అతిపెద్ద ప్రజారోగ్య విప్లవంగా బిల్లును అభివర్ణించారు.

 పొగాకు పరిశ్రమలు, రిటైలర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలను విద్యావంతులను చేయడంపై కూడా దృష్టి సారించాలని కన్జర్వేటివ్ పీర్ లార్డ్ నాస్బీ సూచించారు. కాగా.. బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్ తరాన్ని పొగాకు నుంచి కాపాడేందుకు ఇదొక సాహసోపేతమైన అడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.