
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో.. ఎంత సరుకు పట్టుబడింది, ఓటర్లకు పంచేందుకు తీసుకెళుతున్న డబ్బు ఎంత పట్టుబడిందనే లెక్కలను కేంద్ర ఎన్నికల సంఘం బయటపెట్టింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్.. ఈ రెండు రాష్ట్రాల్లో పట్టుబడిన డబ్బు, మద్యం, ఇతర ఎన్నికల తాయిలాల విలువ వెయ్యి కోట్లు దాటిందని స్వయంగా ఎన్నికల సంఘమే ప్రకటించింది. ఏప్రిల్ 22 నాటికి.. పట్టుబడిన డబ్బు, మద్యం విలువ ఒక వెయ్యి 72 కోట్లు.
తమిళనాడులో ఈ ఎన్నికల తాయిలాల విలువ రూ.599.24 కోట్లు కాగా, పశ్చిమ బెంగాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు పంచాలని చూసిన డబ్బు, మద్యం విలువ రూ.472.89 కోట్లు. ఈ రెండు రాష్ట్రాల్లో పట్టుబడిన దాంట్లో.. రూ.127.67 కోట్లు డబ్బు.. 40 లక్షల లీటర్ల మద్యం (ఈ మద్యం విలువ రూ.106.3 కోట్లు), 184.83 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, 215.19 కోట్ల రూపాయల బంగారం, వెండి.. ఖరీదైన ఆభరణాలు.. ఇవి కాకుండా రూ.437.97 కోట్ల రూపాయల విలువైన ఇతరత్రా వస్తువులను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్లో మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న జరుగుతుండగా, రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరుగుతాయి. అస్సోం, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే ఫేజ్లో ఏప్రిల్ 23న జరుగుతాయి. మే 4న ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సోం, కేరళ.. ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మే 4వ తేదీన ప్రకటిస్తారు.