Reading Time: 2 minutes

‘MRP: నీకెంత.. నాకెంత’.. నవ్వులు పూయిస్తున్న నరేశ్ అగస్త్య, సుదర్శన్ మూవీ టీజర్!

Caption of Image.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాకర్ట్ నరేశ్ అగస్త్య, కామెడీ కింగ్ వెన్నెల కిశోర్, ఫన్ బాంబ్ సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎంఆర్‌పీ’ (MRP). ‘నీకెంత.. నాకెంత’ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ భారీ అంచనాలను పెంచేస్తోంది. 

కలల కోసం పోరాటం.. !

‘మన కల కోసం మనం పనిచేయకపోతే.. వేరే వాళ్ల కలల కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది’ అనే పవర్‌ఫుల్ డైలాగుతో ప్రారంభమైన ఈ టీజర్, నేటి యువత ఆలోచనలను ప్రతిబింబిస్తోంది. మధ్యతరగతి యువత తమ కలలను నిజం చేసుకునే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లు, ఆర్థిక లావాదేవీల చుట్టూ సాగే విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ చిత్రానికి శ్రవణ్ జేస్టా దర్శకత్వం వహించారు. ఒక సీరియస్ పాయింట్‌ను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రెజెంట్ చేయడంలో ఆయన సక్సెస్ అయినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. బాలీవుడ్ భామ, బిగ్ బాస్ ఫేమ్ డోనాల్ బిష్ట్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. ఆమె గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. అజయ్ అరసాడ అందిస్తున్న నేపథ్య సంగీతం టీజర్‌ను మరింత ఎనర్జిటిక్‌గా మార్చింది.

ALSO READ : ఓటు వేసేందుకే.. విదేశాల నుంచి వచ్చిన హీరో అజిత్ కుమార్

మాస్ అండ్ క్లాస్ టచ్ లో..

గతంలో ‘మత్తు వదలరా’, ‘సేనాపతి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేశ్‌ అగస్త్య, ఈసారి ఒక మాస్ అండ్ క్లాస్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. ఇక వెన్నెల కిశోర్ తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించడానికి సిద్ధమయ్యారు. ఎం.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం, అటు యాక్షన్ ఇటు కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ టీజర్, సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. మరి ‘ఎంఆర్‌పీ’తో ఈ టీమ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.