
హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం (ఏప్రిల్ 22) తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నాదెండ్ల మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గురువారం (ఏప్రిల్ 23) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నాదెండ్ల రాజకీయ ప్రస్థానం:
1935, జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కర్ ఉస్మానియా యూనివర్శిటీ నుంచి లా పట్టా పొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాదెండ్ల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1978లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో1982లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు.
టీడీపీ ఏర్పాటులో కూడా నాదెండ్ల కీ రోల్ ప్లే చేశారు. 1983 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే 1984 ఆగస్టులో ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదెండ్ల రాజకీయ తిరుగుబాటు చేశారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అప్పటి గవర్నర్ రామ్ లాల్ సహాయంతో సీఎం పదవి చేపట్టారు.
1984, ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 అంటే కేవలం 31 రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక, ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ధర్మయుద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో నాదెండ్ల కేవలం నెలరోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో ఆయన తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
1989లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1998లో ఖమ్మం నుంచి గెలిచి 12వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019, జూలై 6న హైదరాబాద్లోని శంషాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అనారోగ్య సమస్యలు, వయోభారం కారణంగా గత కొంత కాలంగా నాదెండ్ల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేస్తున్నారు. జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ నెంబర్.2గా ఉన్న సంగతి తెలిసిందే.