
తొర్రూరు, వెలుగు: యువత ఉజ్వల భవిష్యత్తే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ సేవలు వంటి అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు చెప్పారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్, వైస్ చైర్మన్ రజని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.