Reading Time: < 1 minute

బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైంది: ఎంపీ వంశీ

Caption of Image.

మంచిర్యాల: బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. మంగళవారం (ఏప్రిల్ 21) శ్రీరాంపూర్ సింగరేణి ప్రగతి స్టేడియంలో ఎంపీ వంశీ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా స్థానికలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులతో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఆరోగ్య పరిరక్షణ కు ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలని సూచించారు. యువత క్రీడల వైపు మొగ్గు చూపితే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమన్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ వంశీ మాట్లాడుతూ.. కర్ణాటక బీజేపీ ఎంపీ తెలంగాణ విభజనను పాకిస్తాన్‎తో పోల్చడాన్ని మేము తీవ్రంగా ఖండించామన్నారు. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కర్నాటక ఎంపీ మాటలను సమర్ధిస్తూ అందులో తప్పు ఏం లేదనడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్‏ను లింక్ పెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించామని తెలిపారు. 

బీజేపీ కేవలం మహిళా బిల్లు ప్రవేశ పెడితే సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ లింక్ పెట్టి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. జనాభా లెక్కల ప్రకారం కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లు డీలిమిటేషన్ చేయాలని బీజేపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తామనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. 

పార్లమెంట్‎లో సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నానని.. కార్మికులకు రావాల్సిన పెన్షన్లు, కొత్త గనుల ఏర్పాటుపై అనేక సార్లు ప్రశ్నించానని తెలిపారు. కార్మికులకు రావాల్సిన అన్ని హక్కులను సాధించే వరకు పోరాటం చేస్తానని పేర్కొన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు అంశంపై సంబంధిత మంత్రితో మాట్లాడి వెంటనే అన్ఫిట్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

©️ VIL Media Pvt Ltd.