
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం (ఏప్రిల్ 20) నస్తూర్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రజా పాలన పోవాలి.. పాపాల భైరవుడు కేసీఆర్ రావాలని జీవన్‌రెడ్డి అంటున్నారు.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ప్రజా పాలన పోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా పాలన ఎందుకు పోవాలో జీవన్‌రెడ్డి చెప్పాలి.. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నందుకు పోవాలా.. 4.5 లక్షల ఇళ్లు ఇచ్చినందుకు ప్రభుత్వం పోవాలా అని నిలదీశారు. ప్రజాపాలన జీవన్ రెడ్డి తెస్తే రాలేదని.. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో ఈ ప్రభుత్వం వచ్చిందని కౌంటర్ ఇచ్చారు. పదవి ఇవ్వకపోతే సొంత ప్రభుత్వం పోవాలంటున్న జీవన్ రెడ్డి లాంటి కర్కోటక నాయకుడిని చూడలేదని విమర్శించారు.
►ALSO READ | అధికారంలోకి రాగానే మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపడేస్తా: కేసీఆర్
జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓడిపోయినా గౌరవంతో నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చామని గుర్తు చేశారు. అలాంటిది ఏడాది పదవి లేకపోయే సరికి పార్టీని మోసం చేసి వెళ్లిపోతావా.. ఒక్క ఏడాది కార్యకర్తల కోసం ఓపిక పట్టలేకపోయావా అని నిప్పులు చెరిగారు. శత్రువు సంకన చేరి ప్రజాపాలన గురించి మాట్లాడుతావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాపాల బైరవుడు కేసీఆర్ పాపాలు జీవన్ రెడ్డికి తెల్వదా.. అలాంటి వ్యక్తి పార్టీలో చేరడానికి జీవన్ రెడ్డికి సిగ్గు ఉందా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డికి కడుపు నిండా విషమేనని.. దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రిని చేస్తే ఓర్వలేదని విమర్శించారు. జీవన్ రెడ్డి నీతి ఏంది.. దోస్తీ ఏందో మనకు తెలియదా.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది జీవన్ రెడ్డి కాదా అని కీలక వ్యాఖ్యలు చేశారు.