Reading Time: 2 minutes

హైదరాబాద్‌లో 70% మంది కిరాయిదారులే.. అద్దె ఇళ్లకే మస్త్ డిమాండ్..

Caption of Image.

భాగ్యనగరంలో సొంతిల్లు అనేది ఒక తీరని కలగా మారిపోతోందా? తాజా లెక్కలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన SEEEPC సర్వే 2024 ఆసక్తికరమైన, కొద్దిగా షాకింగ్ నిజాలను బయటపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సొంతిల్లు ఉన్నవారి సంఖ్య ఒకలా ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక్కడ మెజారిటీ ప్రజలు ఓనర్ గారు.. ఈ నెలాఖరుకు అద్దె ఇచ్చేస్తాం అనేవారే కావటం గమనార్హం. 

అద్దె ఇళ్లలో హైదరాబాద్ టాప్..
హైదరాబాద్ నగరం ఇప్పుడు అద్దె ఇళ్లకు అడ్డాగా మారింది. ఇక్కడ ఏకంగా 70.63 శాతం మంది అద్దె ఇళ్లలోనే జీవిస్తున్నారు. అంటే ప్రతి 10 మందిలో 7 మంది రెంట్స్ పేచేస్తున్నవారే. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. దానికి ఆనుకుని ఉన్న మెడ్చల్-మల్కాజిగిరిలో 60.91%, రంగారెడ్డిలో  59.71% మంది రెంటెడ్ ఇళ్లలో ఉంటున్నారు. ఐటీ హబ్‌లు, ఉపాధి అవకాశాలు పెరగడంతో జనం ఇక్కడికి క్యూ కట్టడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకటం వల్ల సొంతిల్లు కొనడం సామాన్యులకు కష్టతరం అయ్యింది హైదరాబాదు నగరంలో. 

సొంతిల్లు ఉన్నది 23 శాతం మందికే..
సొంత ఇంటి కల విషయంలో హైదరాబాద్ రాష్ట్రంలోనే అట్టడుగున నిలిచింది. ఇక్కడ కేవలం 23.08 శాతం మందికి మాత్రమే సొంత ఇల్లు ఉంది. దీని తర్వాత మెడ్చల్-మల్కాజిగిరిలో 35.26%, రంగారెడ్డి జిల్లాలో 35.56% సొంతిల్లు కలిగిన ప్రజలు ఉన్నారు. అంటే తెలంగాణ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇల్లు కొనేకంటే.. అద్దెకు ఉండటమే బెటర్ అని జనం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఖమ్మం, నిర్మల్ వంటి జిల్లాలు కూడా ఈ జాబితాలో చివరి వరుసలో ఉన్నాయి.

►ALSO READ | తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఎండలు తగ్గే ఛాన్స్ ఉందా..?

పల్లెల్లోనే పక్కా ఇల్లు..
హైదరాబాద్ నగరానికి భిన్నంగా గ్రామీణ జిల్లాలు సొంత ఇంటి విషయంలో దుమ్మురేపుతున్నాయి. సొంత ఇల్లు కలిగిన లిస్టులో 68.88 శాతంతో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక వనపర్తి 67.02%, జోగులాంబ గద్వాల 65.21% సొంత ఇల్లు కలిగిన ప్రజలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అక్కడ అద్దెకు ఉండేవారు చాలా తక్కువ. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో అద్దె ఇళ్ల వాటా కేవలం 26 శాతం నుంచి 30 శాతం లోపే ఉందని సర్వే తేల్చింది.

ఈ సర్వే డేటా ఒక స్పష్టమైన అర్బన్-రూరల్ గ్యాప్‌ను చూపిస్తోంది. పల్లెల్లో సొంతిల్లు అనేది ఒక ఆస్తిగా, సామాజిక హోదాగా భావిస్తే.. నగరంలో మాత్రం లైఫ్ స్టైల్, ఉద్యోగాల కోసం అద్దె ఇళ్లే దిక్కవుతున్నాయి. భాగ్యనగరం ఇప్పుడు సొంత ఇళ్ల నగరం కంటే అద్దె ఇళ్ల రాజధానిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇల్లు కొనడం అంటే మాటలు కాదు.. అది ఒక పెద్ద అడ్వెంచరే అంటున్నారు అద్దెదారులు. నిలకడలేని జాబ్ మార్కెట్ కూడా ప్రజలను హైదరాబాదులో సొంతింటి కలకు దూరంగా ఉండేలా చేస్తోందని నిపుణులు అంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.