
చాలామంది పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఎంత డబ్బు వస్తుంది అనే దానిపైనే దృష్టి పెడతారు. కానీ, నిజమైన తెలివితేటలు లోన్ మొత్తంతో కాదు, మీరు ప్రతి నెలా కట్టగలిగే EMIతోనే మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు.
మీ బ్యాంకు అకౌంట్లో లోన్ డబ్బు జమ అయిన తరువాత నెల నుంచే మీరు EMI కట్టాల్సి ఉంటుంది. ఈ EMIలో అసలు అంటే మీరు తీసుకున్న అప్పు అలాగే వడ్డీ అంటే తీసుకున్న అప్పుపై ఛార్జితో కలిసి ఉంటాయి. మొదట్లో అప్పు తీసుకోవడం బాగానే ఉన్నా, రోజు ఉండే ఖర్చులు మొదలయ్యాక EMI భారం పెరిగితే జీవితం కష్టమవుతుంది. అందుకే, మీ ప్రతినెల ఆదాయంలో 20 నుంచి 30 శాతం లోపు మాత్రమే EMI ఉండేలా చూసుకోవడం మంచిది.
వడ్డీ ప్రభావం:
లోన్ ఇచ్చే సంస్థలు/బ్యాంకులు మీ వడ్డీ రేటును కొన్ని ముఖ్యమైన విషయాల ఆధారంగా లెక్కిస్తాయి. ఒకటి క్రెడిట్ స్కోర్.. మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, అంత తక్కువ వడ్డీకి అప్పు దొరుకుతుంది.
►ALSO READ | ట్రంప్ వసూలు చేసిన టారిఫ్ డబ్బు రీపేమెంట్ మెుదలు పెట్టిన అమెరికా.. దిగుమతిదారులకు రూ.14 లక్షల కోట్లు రీఫండ్
లోన్ కాలపరిమితి.. తక్కువ కాలానికి అప్పు తీసుకుంటే EMI ఎక్కువగా ఉంటుంది కానీ, మీరు చెల్లించే మొత్తంపై వడ్డీ తగ్గుతుంది. ఎక్కువ కాలపరిమితితో EMI భారం తగ్గుతుంది తప్ప, వడ్డీ పెరుగుతుంది. స్థిరమైన జీతం ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే అవకాశం ఉంది.
EMI లెక్కించే విధానం:
ఒక చిన్న ఉదాహరణ చూస్తే… మీరు 3 లక్షల అప్పును 14% వడ్డీతో 3 ఏళ్లకు తీసుకుంటే, మీ ప్రతినెల EMI రూ.10,253 అవుతుంది. మొత్తం మూడు ఏళ్లలో మీరు కట్టే వడ్డీ సుమారు రూ.69,118. దీనిని లెక్కించడానికి ఆన్‌లైన్ ‘EMI కాలిక్యులేటర్లు’ బాగా ఉపయోగపడతాయి.
వైద్య ఖర్చులు, పిల్లల చదువులు లేదా ఇంటి పనులు వంటి ముఖ్యమైన అవసరాల కోసం లోన్ తీసుకోవడం ప్రయోజనకరం. కానీ, కేవలం విలాసాల కోసం లేదా అనవసరమైన కొనుగోళ్ల కోసం ఆవేశంగా లోన్ తీసుకుంటే ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.
లోన్ తీసుకోవడం కాదు, ఆ లోన్ మీ లైఫ్ స్టయిల్ కి ఆటంకం కలగకుండా తిరిగి కట్టడం. నాకు ఎంత అప్పు వస్తుంది? అని కాకుండా, నేను ఎంత ఈజీగా కట్టగలను? అని ఆలోచించడమే సరైన పద్ధతి. మీ EMIలు మీ బడ్జెట్‌లో ఉన్నప్పుడు, మిగిలిన ఖర్చుల గురించి మీకు దిగులు ఉండదు.