Reading Time: 2 minutes

క్విట్ ఇండియా ఉద్యమం కాంగ్రెస్ పోరాట చరిత్రకు ప్రతీక : పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ కుమార్ గౌడ్

Caption of Image.
  • రాజ్యాంగ పరిరక్షణకు యువత ముందుకు రావాలి
  •     క్విట్ ఇండియా స్ఫూర్తి కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     శాంతి మార్గంలో ఏదైనా సాధించొచ్చు: మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్, వెలుగు: క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన చారిత్రాత్మక పాత్రకు గొప్ప నిదర్శనమని పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నాడు బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కోసం పోరాడామని, నేడు దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు యువత ముందుకురావాలని పిలుపునిచ్చారు. క్విట్​ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేందుకు ఆదివారం కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌‌‌‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్​ కుమార్​ గౌడ్‌‌‌‌తో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్​కుమార్​ గౌడ్ ​మాట్లాడుతూ… స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌‌‌‌భాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల త్యాగాలను నేటి తరం ఎప్పటికీ మరచిపోకూడదన్నారు.‘‘స్వాతంత్ర్యం సాధించడంతోనే మన బాధ్యత పూర్తి కాలేదు. సమరయోధులు ఏ విలువల కోసమైతే పోరాడారో, వాటిని కాపాడటం మనందరి బాధ్యత. రాజ్యాంగం మన దేశానికి దిక్సూచి అయితే, ప్రజాస్వామ్యం మన బలం. లౌకికవాదమే దేశ ఐక్యతకు అసలైన పునాది”అని ఆయన అన్నారు. 

హక్కుల పరిరక్షణకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి

భావప్రకటన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, మత స్వేచ్ఛ, పౌర హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని, ప్రజల ఓటు హక్కును, స్వేచ్ఛను పరిరక్షించడంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు. రాజ్యాంగ విలువలను బలహీనపరిచే ఎలాంటి ప్రయత్నాలనైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

గాంధేయ మార్గంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుకు సాగాలి: శ్రీధర్ బాబు 

శాంతియుత మార్గంలో పోరాడితే ఏదైనా సాధించవచ్చని ఇటీవల జెన్ జీ ఉద్యమంతో మరోసారి నిరూపితమైందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యువత గొప్ప లక్ష్యాలను సాధించారని కొనియాడారు. బీజేపీ విధానాలపై అగ్రనేత రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, గాంధేయ వాదులు చూపిన మార్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. 

క్విట్ ఇండియా ఉద్యమ పోరాట చరిత్ర విద్యార్థులకు, యువతకు సులభంగా అర్థమయ్యేలా గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందని, ఇది యువతలో సరికొత్త చైతన్యాన్ని నింపుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దేశ స్వాతంత్ర్యం కోసం వేలాది మంది సమరయోధులు జైళ్లకు వెళ్లారని, లాఠీ దెబ్బలు తింటూ ప్రాణాలను సైతం త్యాగం చేశారని మంత్రి గుర్తుచేశారు. ‘‘నాడు మహానాయకులు చూపిన స్ఫూర్తితోనే నేడు మనం ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. వారి రాజ్యాంగ హక్కుల కోసం నిలబడుతూ, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం పోరాడాలి”అని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.