Reading Time: < 1 minute

తెలంగాణ విద్యార్థుల ఆవేదన వినిపించదా?…దమ్ముంటే అశోక్ నగర్‌‌‌‌కు రావాలని రాహుల్ కు సవాల్

Caption of Image.
  • కాంగ్రెస్ సర్కార్ ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ బకాయిలు విడుదల చేయట్లే: ఎన్.రాంచందర్ రావు
  •     విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమాల పేరిట పర్యటనలు చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్రంలో నలిగిపోతున్న విద్యార్థుల ఆవేదనను ఎప్పుడు వింటారని బీజేపీ స్టేట్ చీఫ్​ ఎన్. రాంచందర్ రావు ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిల విడుదలలో కాంగ్రెస్ సర్కార్ విఫలం కావడంతో రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆదివారం ఒక ప్రకనటలో ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని, దీంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. 

సుమారు రూ.12 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. 2023 ఎన్నికల సమయంలో హైదరాబాద్‌‌‌‌లోని అశోక్ నగర్‌‌‌‌కు వచ్చి జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రెండున్నరేళ్లు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. రాహుల్ గాంధీకి నిజంగా విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే, అదే అశోక్ నగర్‌‌‌‌లో ఛాత్రోం కీ గూంజ్ ప్రోగ్రామ్ నిర్వహించి, యువతను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. మాటలకే పరిమితం కాకుండా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు.

పలు ఆలయాల్లో పూజలు..

నగరంలోని పలు ఆలయాల్లో నిర్వహిచిన బోనాల ఉత్సవాల్లో రాంచందర్ రావు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తార్నాకలోని నల్ల పోచమ్మ ఆలయం, లాలాపేట్‌‌‌‌లోని పోచమ్మ ఆలయం, మల్కాజిగిరిలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయం, సఫిల్‌‌‌‌గూడలోని కట్ట మైసమ్మ ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవార్లను ప్రార్థించినట్టు  తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.