Reading Time: < 1 minute

ఎక్కడికక్కడే ఆగిపోండి.. మేం చెప్పాకే జర్నీ మొదలుపెట్టండి: హోర్ముజ్‌లోని నౌకలకు ప్రభుత్వం ఆదేశం

Caption of Image.

న్యూఢిల్లీ: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో రెండు భారత దేశ నౌకలపై ఇరాన్ దళాలు దాడి చేయడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా హార్మూజ్ జలసంధి దాటేందుకు పర్షియన్ గల్ఫ్‌లో వేచి ఉన్న భారత నౌకలకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. 

భారతీయ నౌకలు లారాక్ ద్వీపానికి దూరంగా ఉండాలని, ఇండియన్ నేవీ ఆదేశిస్తేనే హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాలని అలర్ట్ చేసింది. హోర్ముజ్ జలసంధిని దాటడానికి వేచి ఉన్న అన్ని భారతీయ నౌకల భద్రతకు ఇండియన్ నేవీ భద్రత కల్పిస్తుందని చెప్పింది. అప్పటి వరకు వేచి చూడాలని సూచించింది

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పదకొండు భారతీయ నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. చివరగా దేశ్ గరిమ నౌక ఏప్రిల్ 18న దాటింది. అదే రోజు జగ్ అర్నవ్, సన్మార్ హెరాల్డ్ అనే రెండు భారతీయ నౌకలు హార్మూజ్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఇరాన్ గార్డులు కాల్పులు జరపడంతో వెనుదిరిగాయి.

ప్రస్తుతం 14  భారతీయ నౌకలు హోర్ముజ్‌ను దాటేందుకు పర్షియన్ గల్ఫ్‌లో వేచి ఉన్నాయి. ఇండియన్ నేవీ ఈ నౌకలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. తమ అనుమతి లభించిన తర్వాతే ముందుకు సాగాలని చమురు నౌకలను నేవీ హెచ్చరించింది. 

హార్మూజ్ మళ్లీ క్లోజ్

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హార్మూజ్ జలసంధిలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. అయితే.. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంట్లలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 

►ALSO READ | అమెరికా-ఇరాన్ చర్చల్లో బిగ్ ట్విస్ట్: రెండో దఫా చర్చలకు ఇరాన్ దూరం

ఇరాన్ తెరిచినా ఒప్పందం ప్రకారం మా లావాదేవీలు పూర్తయ్యాకే హార్ముజ్ జలసంధి ద్వారా పూర్తి స్థాయిలో నౌకల రాకపోకలు జరుగుతాయని చెప్పారు. హార్ముజ్ జలసంధి రాకపోకలకు తెరిచి ఉందని ఇరాన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.